Rythu Bharosa: రైతు భరోసాపై కీలక నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు!
- రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను తెలుసుకోనున్న ప్రభుత్వం
- రేపటి నుంచి ఉమ్మడి జిల్లాల్లో వరుసగా వర్క్ షాప్లు
- రేపు ఖమ్మంలో ప్రారంభమై, 23న రంగారెడ్డిలో ముగియనున్న వర్క్ షాప్ లు
రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 5 ఎకరాలకు ఇవ్వాలా? లేక 10 ఎకరాలకు ఈ స్కీంను వర్తింప చేయాలా? అనే ఆంశంపై క్షేత్రస్థాయిలో రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనుంది. ఇందుకోసం రేపటి నుంచి ఉమ్మడి జిల్లాల్లో వరుసగా వర్క్ షాప్లు నిర్వహించనుంది.
రైతులతో సమావేశమై వారిచ్చే సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటారు. 10న ఖమ్మం, 11న ఆదిలాబాద్, 12న మహబూబ్నగర్, 15న వరంగల్, 16న మెదక్, 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23న రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వం వర్క్ షాప్లు నిర్వహించనుంది. ఈ సమావేశాలకు రైతులు, మేధావులు, రైతు సంఘాలను సమీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.
రైతులు, రైతు సంఘాల నుంచి సేకరించిన అభిప్రాయాలను కలెక్టర్లు నివేదిక రూపంలో పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతు భరోసాపై మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉపసంఘం చైర్మన్గా ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ఆయా జిల్లాల్లో అభిప్రాయ సేకరణలో జిల్లా మంత్రులతో పాటు, ఇంఛార్జ్ మంత్రులు కూడా పాల్గొననున్నారు.