Atchannaidu: గత ప్రభుత్వంలో ఈ శాఖ ఉందని కూడా ఎవరికీ తెలియదు: మంత్రి అచ్చెన్నాయుడు
- మత్స్యశాఖపై అచ్చెన్నాయుడు సమీక్ష
- మత్స్యశాఖ పరిస్థితి చూస్తుంటే చాలా బాధ కలుగుతోందన్న అచ్చెన్నాయుడు
- అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడి
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు నేడు మత్స్యశాఖపై సమీక్ష సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మత్స్యశాఖ పరిస్థితి చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని అన్నారు. గత ప్రభుత్వంలో మత్స్యశాఖ ఉందన్న విషయం కూడా ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు.
వైసీపీ సర్కారు హయాంలో ఐదు హార్బర్లకు టెండర్లు పిలిచి సొంతవారికే కట్టబెట్టారని, రెండోసారి నాలుగు హార్బర్లను వైసీపీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఇచ్చారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. మత్స్యకారులకు డీజిల్ రాయితీ రూ.10 కోట్ల బకాయి ఉందని వెల్లడించారు. డీజిల్ సబ్సిడీ బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
మత్స్యకార భృతిపై సర్వే చేసి 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు నిర్దేశించినట్టు వివరించారు. మత్స్య పరిశ్రమ ఎగుమతుల వృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎగుమతులకు ఉన్న అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించినట్టు అచ్చెన్నాయుడు వెల్లడించారు.