Madhu Yaskhi: తెలంగాణలో దోచుకున్నది చాలదన్నట్లుగా సిగ్గులేకుండా ఢిల్లీ లిక్కర్ స్కాం చేశారు: మధుయాష్కీ
- అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్ టిక్కెట్‌కు డబ్బులు లేని రోజులు మరిచావా? అని కేటీఆర్‌కు ప్రశ్న
- తెలంగాణ రాకముందు మీ ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంతో చెప్పాలని నిలదీత
- ఏళ్ల తరబడి పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే వాయిదా వేయమనడం దుర్మార్గమని వ్యాఖ్య
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన నిజమేనన్న మధుయాష్కీ
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబం తెలంగాణలో దోచుకున్నది చాలదన్నట్లుగా... సిగ్గులేకుండా ఢిల్లీకి వెళ్లి లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నదని మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ్ముడూ... అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్ టిక్కెట్ కొనేందుకు కూడా డబ్బులు లేని రోజులను మరిచిపోయావా? అని కేటీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. తెలంగాణ రాకముందు మీ అయ్యా కొడుకులు, రబ్బర్ చెప్పుల మీ బావ ఆస్తులు ఎంత? అని ప్రశ్నించారు. అలాగే ఇప్పుడు ఆస్తులు ఎన్నో చెప్పాలన్నారు. మీరు దుబాయ్‌లో ఆస్తులు ఎలా కూడబెట్టారో తెలియదనుకున్నావా? అని నిలదీశారు.
నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులుపడి ఏళ్ల తరబడి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారన్నారు. అలాంటప్పుడు నోటిఫికేషన్లు వాయిదా వేయాలని చెప్పడం ఎంత వరకు సమంజసం? అన్నారు. పరీక్షలు వాయిదా వేయాలనేది దుర్మార్గమైన డిమాండ్ అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగ కల్పన కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి షెడ్యూల్ కూడా విడుదల చేసినట్లు చెప్పారు. పరీక్షల వాయిదా డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల కుట్ర కనిపిస్తోందన్నారు. విచారణ జరిపి ఈ కుట్ర వెనుక అసలు కోణాన్ని వెలికి తీయాలన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొంత ఆందోళన నిజమే
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికతో కాంగ్రెస్ నేతల్లో కొంత ఆందోళన ఉన్న మాట వాస్తవమేనని మధుయాష్కీ వెల్లడించారు. కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు చెమటోడ్చి... రక్తాన్ని ధారపోశారన్నారు. కేసులు కూడా ఎదుర్కొన్నట్లు చెప్పారు. అలాంటి వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త వారి చేరికతో మొదటి నుంచి ఉన్న కార్యకర్తల్లో ఆందోళన ఉన్నప్పటికీ.. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో తప్పడం లేదన్నారు.
రేవంత్ రెడ్డి విజయవంతంగా మూడేళ్ల పీసీసీ అధ్యక్ష పదవిని పూర్తి చేసుకున్నారని కితాబునిచ్చారు. సీఎంగా బాధ్యతలు ఉండటంతో పీసీసీ అధ్యక్ష బాధ్యతలను ఇతరులకు ఇవ్వాలన్నారు. కార్యకర్తలను కాపాడుకుంటూ... ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే వారికి పీసీసీ పదవి వస్తుందన్నారు.