Bandi Sanjay: నామాలు పెట్టుకుని.. వేంకటేశ్వరస్వామికి, టీటీడీ ఆస్తులకు పంగనామాలు పెట్టారు: బండి సంజయ్
- నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్
- తిరుమలను అపవిత్రం చేశారంటూ గత ప్రభుత్వంపై విమర్శలు
- వీరప్పన్ వారసుల చేతిలో టీటీడీ పాలన సాగిందని మండిపాటు
గత వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు. స్వామి వారిపై భక్తి లేని వారు నామాలు పెట్టుకుని... స్వామికి, టీటీడీ ఆస్తులకు పంగనామాలు పెట్టారని మండిపడ్డారు. ఇతర మతస్తులకు అధికారాన్ని అప్పగించి తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేశారని దుయ్యబట్టారు.
గత ఐదేళ్లు వీరప్పన్ వారసుల చేతిలో టీటీడీ పాలన సాగిందని సంజయ్ అన్నారు. ఎర్రచందనం కొల్లగొట్టి వేల కోట్లను సంపాదించారని చెప్పారు. ఎర్ర చందనం స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని... వారిని వదిలి పెట్టబోమని అన్నారు. వేంకటేశ్వరస్వామి వారి దయ, భిక్షతో కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగానని చెప్పారు.
ఈరోజు బండి సంజయ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ తో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి హోదాలో స్వామి వారిని బండి సంజయ్ దర్శించుకోవడం ఇదే తొలిసారి.