BSNL: 13 నెలల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్.. ప్రయోజనాలు ఇవే!
- రూ.2,399తో 395 రోజుల వ్యాలిడిటీతో ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వరంగ టెలికం కంపెనీ
- 4జీ స్పీడ్‌తో రోజుకు 2జీబీ డేటాతో పాటు రోమింగ్ కూడా ఉచితం
- త్వరలోనే దేశవ్యాప్తంగా 4జీ నెట్ వర్క్‌ను ప్రారంభించబోతున్న బీఎస్ఎన్ఎల్
ప్రభుత్వరంగ టెలికం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ త్వరలోనే దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ మేరకు నెట్వర్క్ అప్‌గ్రేడ్‌కు సంబంధించిన పనులను కంపెనీ చక్కబెడుతోంది. అయితే 4జీ సేవల ప్రారంభానికి ముందే అదిరిపోయే ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. 13 నెలల వ్యాలిడిటీతో (395 రోజులు) తీసుకొచ్చిన ఈ ప్లాన్ ధర రూ. 2,399గా ఉంది. నెలకు రూ.200 కంటే తక్కువే పడుతున్న ఈ ఆఫర్లో రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఇక రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు, దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత రోమింగ్, ఇంకా అనేక విలువ ఆధారిత సేవలను యూజర్లు పొందవచ్చు. జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమన్ ఆస్ట్రోటెల్ వంటి సర్వీసులు ఉన్నాయి.
365 రోజుల ప్లాన్ ప్రయోజనాలు ఇవే..
ఒక ఏడాది ప్లాన్లలో భాగంగా 365 రోజుల ప్లాన్‌ను కూడా బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో రోజువారీ పరిమితి లేకుండా మొత్తం 600జీబీల డేటాను కంపెనీ అందిస్తోంది. ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు, దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు.
బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్న కస్టమర్లు..
ఇటీవల అన్ని టెలికం కంపెనీలు టారిఫ్ ప్లాన్లను భారీ పెంచాయి. దీంతో ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్కు సంబంధించిన పలు పోస్టులు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి. దీంతో రేట్లు పెరిగిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ప్లాన్ల వైపు కస్టమర్లు చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కస్టమర్లను ఆకర్షించుకోవడమే లక్ష్యంగా మెరుగైన సేవలతో ఆకర్షణీయమైన ఆఫర్లు అందించేందుకు బీఎస్ఎన్ఎల్ సమాయత్తమవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.