Viral Videos: తాగితే తాగారు కానీ సీసాలు పగలకొట్టకండి.. వైరల్ వీడియో!
- ఏపీలో మందుబాబులకు ప్రభుత్వ ఉపాధ్యాయుడి విజ్ఞప్తి
- గ్రామంలో డప్పుతో చాటింపు వేసిన విజయనగరం స్కూలు టీచర్
- పొలాల్లో సీసాలు పగలగొట్టడం వల్ల రైతులు అవస్థపడుతున్నారని వెల్లడి
‘మద్యపానం హానికరమనే విషయం విస్మరించి తాగుతున్నారు.. మీ సంతోషం కోసం తాగితే తాగారు కానీ సీసాలు మాత్రం పగలగొట్టకండి’ అంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు డప్పుతో దండోరా వేస్తూ, పిల్లలతో కలిసి గ్రామ వీధుల్లో ప్రచారం చేశారు. మద్యం సీసాలు పగల కొట్టడం వల్ల పొలాల్లో రైతులు అవస్థపడుతున్నారని, గాజు ముక్కలు గుచ్చుకుని మూగజీవాలు నెత్తురోడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో విశేషాలు..
విజయనగరం జిల్లా, తెర్లాం మండలం, నందబలగ జెడ్పీహెచ్ఎస్ టీచర్ మోహన్ రావు తన విద్యార్థులతో కలిసి ఊర్లో ర్యాలీ తీశారు. డప్పుతో దండోరా వేస్తూ మందుబాబులకు విజ్ఞప్తి చేశారు. మద్యం సేవించాక ఖాళీ సీసాలను పగలగొట్టవద్దని చెప్పారు. పగిలిన ముక్కలను పంట పొలాల్లో పడేస్తే రైతులు, కూలీలకు గాయాలవుతాయని, రోడ్డు పక్కన పడేస్తే మూగజీవాలకు ఇబ్బందని తెలిపారు. ఆ సీసాలను అలాగే అక్కడే వదిలేస్తే పాత సీసాలు ఏరుకునే వారికి నాలుగు రూపాయలు వస్తాయని టీచర్ మోహన్ రావు గుర్తుచేశారు. ఇకపై ఎవరూ మద్యం సీసాలను పగలగొట్టవద్దంటూ గ్రామస్థులకు అవగాహన కల్పించారు.