Sidda Reddy: వైసీపీ మోసం చేసిందంటూ కంటతడి పెట్టిన మాజీ ఎమ్మెల్యే
- కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని సస్పెండ్ చేసిన వైసీపీ అధిష్ఠానం
- ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పని చేస్తే సస్పెండ్ చేశారని సిద్ధారెడ్డి మండిపాటు
- రేపటి నుంచి కొత్త రాజకీయం చూపిస్తానని వ్యాఖ్య
తనను వైసీపీ అధిష్ఠానం మోసం చేసిందంటూ కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పని చేస్తే సస్పెండ్ చేస్తారా? అని మండిపడ్డారు. తాను పార్టీకి ఎలాంటి మోసం చేయలేదని చెప్పిన ఆయన... తనకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే, తన నుంచి వివరణ తీసుకోకుండానే సస్పెండ్ చేశారని అన్నారు.
2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చాంద్ బాషా పార్టీ ఫిరాయించారని... అయినప్పటికీ పదేళ్లుగా తాను పార్టీని బలోపేతం చేశానని చెప్పారు. ఒక్కో ఇటుక పేర్చుతూ పార్టీని బలోపేతం చేశానని తెలిపారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు.
తాను ఎమ్మెల్యేగా ఉండగానే మరో వ్యక్తిని ఇన్ఛార్జీగా తీసుకొచ్చి తనను అవమానించారని సిద్ధారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఫోన్ చేస్తే స్పందించొద్దని అధికారులను కట్టడి చేశారని మండిపడ్డారు. కొంతమంది డబ్బులు, పదవుల కోసం పార్టీని నాశనం చేశారని చెప్పారు. జగన్ తనకు నేరుగా చెప్పి ఉంటే... తానే తప్పుకునే వాడినని అన్నారు.
రేపటి నుంచి తన కొత్త రాజకీయం చూస్తారని సిద్ధారెడ్డి చెప్పారు. తాను ఏ పార్టీలో చేరాలనే విషయంపై తన సన్నిహితులతో చర్చించి, నిర్ణయం తీసుకుంటానని అన్నారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కదిరి టికెట్ ను సిద్ధారెడ్డికి కాకుండా... మక్బూల్ అహ్మద్ కు ఇచ్చారు. మక్బూల్ పై టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ గెలుపొందారు. కాగా, ఆ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేశారనే ఆరోపణలతో సిద్ధారెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు.