KTR: తనకు కేటీఆర్ లేఖ రాయడంపై బండి సంజయ్ కౌంటర్
- కేటీఆర్కు నేతన్నలు ఇన్నాళ్లకు గుర్తు వచ్చారా? అని ఎద్దేవా
- మీ హయాం నుంచి నేతన్నల ఆకలి చావులు కొనసాగుతున్నాయని వ్యాఖ్య
- మీరు నేతన్నలను సంక్షోభం నుంచి ఎందుకు గట్టెక్కించలేదని ప్రశ్న
- సిరిసిల్ల నేతన్నలను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కృషి చేస్తానని హామీ
సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురావాలంటూ తనకు లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్కు నేతన్నలు ఇన్నాళ్లకు గుర్తు వచ్చారా? అని ఎద్దేవా చేశారు. సిరిసిల్లకు గత పదిహేనేళ్లుగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. మీ హయాం నుంచి నేతన్నల ఆకలి చావులు కొనసాగుతున్నాయని విమర్శించారు. అలాంటప్పుడు మీరు నేతన్నలను సంక్షోభం నుంచి ఎందుకు గట్టెక్కించలేదో చెప్పాలన్నారు.
బతుకమ్మ పండుగకు సంబంధించిన బకాయిలు చెల్లించకుండా పవర్ లూమ్ సంస్థలు మూతబడేలా చేసింది మీరు కాదా? అని మండిపడ్డారు. ప్రధానమంత్రి తెలంగాణకు మెగా టెక్స్ టైల్ పార్కును ప్రకటించినప్పుడు మీకు సిరిసిల్ల గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. సిరిసిల్ల నేతన్నలను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు తాను శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు.