Nepal Bus Accident: నేపాల్ లో నదిలో పడ్డ బస్సులు.. 60 మంది మిస్సింగ్.. వీడియో ఇదిగో!

Landslide sweeps away two passenger bus into Trishuli River In Nepal
  • కొండచరియలు విరిగిపడడంతో బోల్తా పడ్డ బస్సులు
  • ప్రమాదం నుంచి బయటపడ్డ ముగ్గురు 
  • రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ లు.. నదిలో గాలింపు చర్యలు
నేపాల్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. రెండు బస్సుల్లో కలిపి 63 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో ముగ్గురు బయటపడగా, మిగతా 60 మంది నీటిలో గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుందని తెలిపారు. నదిలో గల్లంతైన ప్రయాణికుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

 కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు త్రిశూలి నది ఉప్పొంగి ప్రవహిస్తోందని అధికారులు చెప్పారు. త్రిశూలి నదికి రెండువైపులా కొండలు ఉండగా.. ఓ కొండను ఆనుకుని నారాయణ్ ఘాట్ - మగ్లింగ్ రోడ్ ఉంటుంది. శుక్రవారం తెల్లవారుజామున బస్సులు ఈ రోడ్ పై వెళుతుండగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బస్సులు అదుపుతప్పి నదిలో పడ్డాయని అధికారులు వివరించారు. ఈ ప్రమాదం గురించిన సమాచారం అందగానే పోలీసులు, సైన్యం స్పందించాయని, సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. బోట్లతో త్రిశూల్ నదిలో గాలిస్తున్నారని వివరించారు. అయితే, వరద ఎక్కువగా ఉండడంతో గాలింపు కష్టంగా మారిందని తెలిపారు. కాగా, కొండచరియల కారణంగా నారాయణ్ ఘాట్ - మగ్లింగ్ రోడ్ ప్రస్తుతం బ్లాక్ అయిందని స్థానిక ఎస్పీ భవేష్ రిమాల్ వివరించారు.
Nepal Bus Accident
Buses Fall in River
Trishuli River
60 Missing
Narayan Ghat Road

More Telugu News