Joe Biden: డాక్టర్లు సూచిస్తే వైద్య పరీక్షలకు సిద్ధమేనన్న జో బైడెన్
- కానీ వైద్యులెవరూ అలా సూచించడం లేదని వ్యాఖ్య
- ఇప్పటికే మూడుసార్లు మెదడు పరీక్షలు చేయించుకున్నట్లు వెల్లడి
- నిత్యం వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటున్నట్లు ప్రకటన
- జ్ఞానానికి వయసు పెరుగుదల మూలమని కామెంట్
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో తిరిగి నిలిచిన దేశాధ్యక్షుడు జో బైడెన్ ను తప్పుకోవాలని ఓవైపు సొంత పార్టీ అయిన డెమోక్రాట్ల నుంచి ఒత్తిడి వస్తున్నా ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. 81 ఏళ్ల వయసులో తన మానసిక ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న ఆందోళనలకు తెరదించేందుకు అవసరమైతే నరాల సంబంధ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధమని ప్రకటించారు. అయితే ఆ విషయాన్ని తన వైద్యులు సూచించాల్సి ఉందని బైడెన్ పేర్కొన్నారు.
‘నేను వైద్య పరీక్షలకు వ్యతిరేకం కాదు. నేను మరోసారి నరాల సంబంధ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు ఒకవేళ సూచిస్తే అందుకు సిద్ధమే’ అని నాటో సదస్సు ముగింపు సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బైడెన్ చెప్పారు. ‘నేను ప్రతిరోజూ మంచి వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటున్నాను. ఒకవేళ నాకు ఏదైనా సమస్య ఉందని వారు భావించినా లేదా మరోసారి న్యూరోలాజికల్ ఎగ్జామ్ నిర్వహించాలనుకున్నా అందుకు రెడీగా ఉన్నా. కానీ ఇప్పటికిప్పుడు వైద్యులెవరూ అలాంటి సూచనలు చేయడంలేదు’ అని బైడెన్ చెప్పుకొచ్చారు.
తన వయసుపై సర్వత్రా ఆందోళన వ్యక్తం కావడంపై బైడెన్ మండిపడ్డారు. ‘నేను ఎంత చేసినా ఎవరూ సంతృప్తి చెందడం లేదు. ఇప్పటికే మూడుసార్లు మెదడు పరీక్షలు చేయించుకున్నా. తాజా పరీక్ష ఫిబ్రవరిలో జరిగింది. నేను నిత్యం తీసుకొనే నిర్ణయాల కోసం నా నరాల సామర్థ్యాన్ని ప్రతిరోజూ పరీక్షిస్తున్నారు. కానీ జ్ఞానానికి వయసు పెరుగుదల మూలం’ అని బైడెన్ గుర్తుచేశారు. అందుకే అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి పోటీ చేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. కానీ తన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వ్యతిరేకులు, అమెరికా ఓటర్లకే ఈ విషయాన్ని వదిలేయాల్సి ఉందని మాత్రం బైడెన్ అంగీకరించారు.
అయితే రాబోయే రోజుల్లో ప్రచారం కోసం విస్తృతంగా పర్యటించనున్నట్లు బైడెన్ చెప్పారు. విస్కాన్సిన్ నుంచి ఉత్తర కరోలినా వరకు సుడిగాలి పర్యటనల ద్వారా 20కిపైగా ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు వివరించారు. తన పాలనలో సాధించిన అభివృద్ధి కుంటుపడకుండా ఉండాలన్నా.. అభివృద్ధి కొనసాగాలన్నా అందుకు తన అవసరం ఎంత ఉందో ప్రజలకు వివరిస్తానన్నారు. తద్వారా ప్రజలు తనవైపు మొగ్గుచూపేలా ఒప్పిస్తానని చెప్పారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తో జూన్ 28న జరిగిన డిబేట్ లో జో బైడెన్ పదేపదే తడబడి ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన్ను ఎన్నికల బరి నుంచి తప్పుకోవాల్సిందిగా పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఆయన మాత్రం ఈ పోటీలో నిలుస్తానని.. ట్రంప్ ను ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు.