TGSRTC: ఇక తెలంగాణలో ప్రయాణాల్లో చిల్లర కష్టాలకు చెక్.. ఆన్ లైన్ పేమెంట్ తోనూ బస్ టికెట్ కొనొచ్చు

i TIMs in buses to facilitate cashless transactions says TGSRTC Officials
  • పది వేల ఐ- టిమ్స్ కొనుగోలు చేయనున్న టీజీఎస్ ఆర్టీసీ
  • ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి తెలంగాణ అంతటా అమలు
  • మరింత సౌకర్యవంతంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం
బస్సు ప్రయాణాల్లో తరచూ ఎదుర్కొనే ఇబ్బంది ‘చిల్లర’.. టికెట్టుకు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్ కు సహకరించండంటూ ప్రతీ బస్సులోనూ ఎర్రటి అక్షరాలతో రాసి ఉంటుంది. చిల్లర లేక దిగేటప్పుడు తీసుకోండని కండక్టర్లు టికెట్ వెనకాల రాసివ్వడమూ మామూలే.. ఇకపై ఈ చిల్లర కష్టాలకు చెక్ పడనుంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) కొత్త ఐ-టిమ్స్ ను కొనుగోలు చేయనుంది. నగదు రహిత చెల్లింపులు (ఆన్ లైన్ పేమెంట్స్) కు ఈ టిమ్స్ ఉపయోగపడతాయి. అంటే.. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా టికెట్ కొనుగోలు చేయొచ్చు.

టికెట్ ధర ఎంతుంటే అంతే మొత్తాన్ని క్షణాలలో చెల్లించవచ్చు. ప్రస్తుతం బండ్లగూడ, దిల్ సుఖ్ నగర్ రూట్ లలో కొన్ని బస్సుల్లో ప్రయోగాత్మకంగా ఈ ఐ-టిమ్స్ ను పరీక్షిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వచ్చే నెలలో సిటీ బస్సుల్లో సెప్టెంబర్ లో రాష్ట్రవ్యాప్తంగా పల్లె బస్సుల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఒక్కో టిమ్‌ను రూ.9,200 (జీఎస్టీ అదనం)కు కొనుగోలు చేస్తున్నట్లు ఆర్టీసీ వర్గాల సమాచారం.

మహిళలకు స్మార్ట్ కార్డుల జారీ..
‘మహాలక్ష్మి’ పథకం అమలులోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఆధార్ కార్డు చూపిస్తే కండక్టర్లు వీరికి జీరో టికెట్ జారీ చేస్తున్నారు. త్వరలోనే మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. బస్సు ప్రయాణాల్లో ఆ కార్డును స్వైప్ చేసి జీరో టికెట్ పొందవచ్చని వివరించారు.
TGSRTC
iTims
Bus Ticket
UPI Payments
Cash less

More Telugu News