Kangana Ranaut: నన్ను కలవాలనుకుంటే ఆధార్ కార్డులు తెచ్చుకోండి: కంగనా రనౌత్
- నియోజకవర్గ ప్రజలకు బాలీవుడ్ నటి, మండి ఎంపీ కంగనా రనౌత్ షరతు
- పనుల వివరాలను ఓ కాగితంపై రాసుకొని రావాలని డిమాండ్
- ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టిన కాంగ్రెస్.. అలా కోరడం సరికాదని హితవు
హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గ ఎంపీగా గెలిచిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై తాజాగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ ప్రజలు వారి సమస్యలపై తనను కలవాలనుకుంటే అక్కడి చిరునామా ఉన్నట్లు చూపే ఆధార్ కార్డులు వెంట తెచ్చుకోవాలంటూ ఆమె షరతు విధించారు. అలాగే ఏ ఉద్దేశంతో తనను కలిసేందుకు వచ్చారో కూడా ఓ కాగితంపై రాసి తీసుకురావాలని సూచించారు.
‘హిమాచల్ ప్రదేశ్ కు చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. అందువల్ల మండి ప్రాంతం నుంచి వచ్చే వారు ఆధార్ కార్డులు తీసుకురావడం తప్పనిసరి. నియోజకవర్గ పనులకు సంబంధించిన వివరాలను కూడా కాగితంపై తీసుకురండి. దీనివల్ల మీరు (ప్రజలు) ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటారు’ అంటూ కంగనా విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.
అలాగే హిమాచల్ ప్రదేశ్ లోని ఉత్తర ప్రాంత ప్రజలు తనను కలవాలనుకుంటే మనాలీలో తన నివాసానికి రావాలని కంగనా సూచించారు. అలాగే మండి పట్టణంలోని ప్రజలు అక్కడున్న తన ఆఫీసుకు రావాలని కోరారు. నియోజకవర్గ పనులకు సంబంధించి ప్రజలు తనను వ్యక్తిగతంగా కలవడం మెరుగ్గా ఉంటుందన్నారు.
అయితే కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. తనను కలవాలనుకొనే ప్రజలు ఆధార్ కార్డులు తీసుకురావాల్సిన అవసరం లేదని ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ వ్యాఖ్యానించారు.
‘మేం ప్రజలకు ప్రతినిధులం. రాష్ర్టంలోని అన్ని వర్గాల ప్రజలను కలవడం మా బాధ్యత. అది చిన్న పని అయినా లేదా పెద్ద పని అయినా లేదా విధాన నిర్ణయమైనా లేదా వ్యక్తిగత పని అయినా అందుకు గుర్తింపు పత్రం చూపాల్సిన అవసరం లేదు. ప్రజలు ప్రజాప్రతినిధుల దగ్గరకు వస్తున్నారంటే ఏదో పని కోసమే వస్తారు. అలాంటిది ప్రజలను కాగితాలు తీసుకురావాలని కోరడం సరికాదు’ అని విక్రమాదిత్య సింగ్ విలేకరులతో మాట్లాడుతూ కంగన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆరుసార్లు పనిచేసిన వీరభద్ర సింగ్ కుమారుడే విక్రమాదిత్య సింగ్. ఆయన తల్లి ప్రతిభా సింగ్ ఆ రాష్ర్ట కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నారు. ప్రస్తుతం విక్రమాదిత్య సింగ్ రాష్ర్ట ప్రజాపనుల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.