YS Sharmila: రాత్రి పడిన గుంతలోనే పగటిపూట కూడా పడతారా అనేది టీడీపీ నేతలు ఆలోచించుకోవాలి: షర్మిల
- ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రెస్ మీట్
- నాడు వైస్సార్ వందల కోట్లు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ను ఆదుకున్నారని వెల్లడి
- ఆ తర్వాత వచ్చిన సీఎంలు పట్టించుకోలేదని ఆరోపణ
- మోదీని టీడీపీ నేతలు మళ్లీ నమ్ముతున్నారని విమర్శలు
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వందల కోట్లు వచ్చి ఆదుకున్నారని, కానీ, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ ఉక్కు పరిశ్రమను పట్టించుకోలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మేం మోదీతో మాట్లాడతాం... ప్రైవేటీకరణ కాకుండా ఒప్పిస్తాం అని ఇప్పుడు టీడీపీ వాళ్లు మాట్లాడుతున్నారని... మరి మోదీ ఒప్పుకోకపోతే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తారా? అని షర్మిల టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు.
"ఏ మోదీతో మాట్లాడతారు? మోదీ మనల్ని పది సంవత్సరాలుగా మోసం చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ 2014లో తిరుపతిలో మాటివ్వలేదా? ఈ పదేళ్లలో మోదీ ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోగలిగారా?
ప్రత్యేక హోదా, పోలవరం, కడప స్టీల్ ఫ్యాక్టరీ, పోర్టులు, రాజధాని... ఇలా ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా? మరి అదే మోదీ మీద మాకు నమ్మకం ఉంది... ఆదుకుంటారు అని టీడీపీ వాళ్లు చెబుతున్నారు... రాత్రి పడిన గుంతలోనే పగటిపూట కూడా పడతారా? అనేది టీడీపీ ఆలోచించుకోవాలి. ప్రజలకు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారో టీడీపీ నేతలు ఒకసారి పరిశీలన చేసుకోవాలి.
మోదీ అంటేనే మోసం. మోదీ అంటేనే వెన్నుపోటు. మోదీ పదేళ్లుగా ఏపీకి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. అలాంటి మోదీ చేతుల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పెట్టడం దారుణం.
జగన్ గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ రాజశేఖర్ రెడ్డి గారికి ఇష్టమైన ప్రాజెక్ట్ అని తెలిసి కూడా, ఆ ప్లాంట్ ను కాపాడేందుకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని ఆయా సంఘాలు వచ్చి జగన్ ను కలిస్తే... అయ్యో, నష్టాల్లో ఉందా అని జగన్ అన్నారే తప్ప, చేసిందేమీ లేదు.
ఇప్పుడు చంద్రబాబు తన వాళ్లతో గందరగోళం సృష్టించే ప్రకటనలు ఇప్పిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు మాట్లాడాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు ఢిల్లీలో కూటమి పెద్దలందరితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోవడం లేదు అని చెప్పాలి... తద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో నమ్మకం కలిగించాలి" అని షర్మిల డిమాండ్ చేశారు.