James Anderson: అంతర్జాతీయ క్రికెట్లో ముగిసిన ఆండర్సన్ శకం
- టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్
- వెస్టిండీస్ తో నేడు ముగిసిన టెస్టే ఆండర్సన్ కు చివరి టెస్టు
- కెరీర్ లో 188 టెస్టులాడి 704 వికెట్లు తీసిన ఆండర్సన్
- అరుదైన రికార్డులు సొంతం చేసుకున్న లెజెండరీ ఫాస్ట్ బౌలర్
ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ తన కెరీర్ లో చివరి టెస్టు ఆడేశాడు. వెస్టిండీస్ తో లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టు మ్యాచ్ తో ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఈ నెల 10న మొదలైన ఈ మ్యాచ్ కేవలం మూడ్రోజుల్లోనే ముగియగా, ఇంగ్లండ్ జట్టే విజయం సాధించింది. ఈ టెస్టులో ఆండర్సన్ రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 4 వికెట్లు తీశాడు.
41 ఏళ్ల ఆండర్సన్ ఇంగ్లండ్ క్రికెట్ జట్టు చరిత్రలోనే నికార్సయిన ఫాస్ట్ బౌలర్ గా నిలిచిపోతాడు. తన పేస్, స్వింగ్ తో మేటి బ్యాట్స్ మెన్లను సైతం హడలెత్తించడం ఆండర్సన్ కే చెల్లింది. ఇప్పటికే వన్డేలు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆండర్సన్... ఇప్పుడు టెస్టు ఫార్మాట్ నుంచి కూడా తప్పుకున్నాడు.
కెరీర్ లో ఇప్పటిదాకా 188 టెస్టులు ఆడిన ఆండర్సన్ 704 వికెట్లు తీసి సత్తా చాటాడు. టెస్టు క్రికెట్లో 700 వికెట్ల మైలురాయిని అందుకున్న ఒకే ఒక్క ఫాస్ట్ బౌలర్ ఆండర్సన్. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఆండర్సన్ మూడో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (800), రెండో స్థానంలో ఆసీస్ లెజెండ్ షేన్ వార్న్ (708)) ఉన్నారు. వీరిద్దరూ స్పిన్నర్లే. ఆండర్సన్ తన టెస్టు కెరీర్ లో 32 సార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
ఈ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ తన టెస్టు కెరీర్ లో అత్యధిక వికెట్లు భారత్ పైనే పడగొట్టాడు. ఆండర్సన్ భారత్ తో 39 టెస్టుల్లో 149 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాపై 39 టెస్టుల్లో 117 వికెట్లు సాధించాడు.
ఇక, తన చివరి టెస్టులోనూ ఆండర్సన్ ఓ అరుదైన రికార్డు నమోదు చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 40 వేల బంతులు విసిరిన తొలి ఫాస్ట్ బౌలర్ గా రికార్డు పుటల్లోకెక్కాడు. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ (44,039), అనిల్ కుంబ్లే (40,850), షేన్ వార్న్ (40,705) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. వీరు ముగ్గురూ స్పిన్నర్లే. అత్యధిక బంతులు విసిరిన బౌలర్లలో ఆండర్సన్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఆండర్సన్ 194 వన్డేల్లో 269 వికెట్లు, 19 అంతర్జాతీయ టీ20 పోటీల్లో 18 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లో ఒకే ఒక్క అర్థం సెంచరీ సాధించాడు. అది కూడా టెస్టుల్లో. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆండర్సన్ రికార్డు మామూలుగా లేదు. 297 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన ఆండర్సన్ 1,122 వికెట్లు తీయడం విశేషం.