Dharmendra Pradhan: మోదీ ప్రధానిగా ఉన్నన్ని రోజులు రిజర్వేషన్లకు ఎలాంటి ఢోకా ఉండదు: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
- ఎన్డీయే అధికారంలో ఉన్నన్ని రోజులు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదన్న కేంద్రమంత్రి
- తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సామాన్యుడే ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్య
- దక్షిణ భారతంలో బీజేపీ బలపడిందని వెల్లడి
నరేంద్రమోదీ ప్రధానిగా ఉన్నన్ని రోజులు రిజర్వేషన్లకు ఎలాంటి ఢోకా ఉండదని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. శంషాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తరచూ అవమానపరుస్తోందన్నారు. ఎన్డీఏ అధికారంలో ఉన్నన్ని రోజులు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ విరోధి అని ఆరోపించారు.
ప్రత్యేక తెలంగాణ కోసం బీజేపీ మద్దతిచ్చిందని గుర్తు చేశారు. బీజేపీలో సామాన్య కార్యకర్త ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సామాన్యుడే ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. బీజేపీలో చేరిన వారంతా పాత నాయకులే అన్నారు. ఈటల రాజేందర్ పార్టీలో కొత్త నాయకుడు కాదని... ఆయన పాత నేత అయిపోయారన్నారు.
దక్షిణ భారతంలో బీజేపీ బలపడిందన్నారు. తెలంగాణ, ఏపీలలో గతంలో కంటే మంచి సీట్లు గెలుచుకున్నామని, కేరళలో బీజేపీ ఖాతా తెరిచిందని, తమిళనాడులో మెరుగైన ఓటు బ్యాంక్ సాధించామన్నారు. తెలంగాణలో బీజేపీని నెంబర్ వన్ పార్టీగా మార్చేందుకు తమ వద్ద 1500 రోజుల ప్రణాళిక ఉందని తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్ బూత్ లెవెల్లో బీజేపీని మరింత బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో కొత్త, పాత అన్నది లేదని తేల్చి చెప్పారు.
గత పదేళ్లుగా ఒక కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్లకు నిద్ర పట్టకుండా చేస్తేనే బీజేపీ ఫస్ట్ స్థానంలోకి వస్తుందని సమావేశానికి హాజరైన నేతలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఊర్లో ఉన్న ప్రతి సమస్యను బీజేపీ కార్యకర్త సామరస్యంగా పరిష్కరించాలని సూచించారు. టాప్ 5 ఎకనామిక్ సిటీస్‌లో హైదరాబాద్ ఉందన్నారు.