KTR: రేవంత్ రెడ్డి 6 నెలల పాలనలోనే మందుగోళీలు దొరకని పరిస్థితి: కేటీఆర్
- సర్కార్ దవాఖానాకు రాను అనే దుస్థితి నుంచి వెళ్దాం పద అనే స్థితికి తీసుకువచ్చామన్న కేటీఆర్
- కానీ ఇప్పుడు మందు గోళీలు కూడా దొరకడం లేదన్న కేటీఆర్
- కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలన్న బీఆర్ఎస్ నేత
కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన ఆరు నెలల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మందు గోళీలు దొరకని దుస్థితి నెలకొందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'సర్కార్ దవాఖానాల్లో గోలీల్లేవ్!' అని నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాన్ని ట్వీట్ చేశారు.
పదేళ్ల కేసీఆర్ పాలన వైద్యానికి జవసత్వాలు ఇచ్చిందని పేర్కొన్నారు. 'నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు' అనే దశాబ్దాల దుస్థితి నుంచి 'చలో పోదాం పదరో సర్కారు దవాఖానకు' అనే ధీమాను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు.
కానీ, గద్దెనెక్కిన ఆరునెలల్లోనే కనీసం మందు గోళీలు కూడా దొరకని దుస్థితికి ప్రభుత్వ ఆసుపత్రులను రేవంత్ రెడ్డి సర్కార్ దిగజార్చిందని ఆరోపించారు. పాలన గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలు అయ్యాయని మండిపడ్డారు.