V Srinivas Goud: ఇష్టం లేకుంటే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోవచ్చు...!: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- తల్లిలాంటి పార్టీని విమర్శించవద్దని పార్టీ మారిన నేతలకు సూచన
- పార్టీ మారే వారంతా తొందరపడుతున్నారని వ్యాఖ్య
- బీఆర్ఎస్కు ఒడిదుడుకులు కొత్త కాదన్న శ్రీనివాస్ గౌడ్
- స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేల అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. పార్టీ మారే వారంతా తొందరపడుతున్నారన్నారు. ఇష్టం లేకుంటే ఎమ్మెల్యేలు వెళ్లిపోవచ్చునని... కానీ తల్లి లాంటి పార్టీని విమర్శించవద్దని సూచించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే కాదు... ఇంకా 14 పార్టీలకు సీట్లు రాలేదని గుర్తు చేశారు. మోదీ కావాలా? వద్దా? అనే ప్రాతిపదిక మీద లోక్ సభ ఎన్నికలు జరిగాయన్నారు. రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు ఈ విషయాలు గుర్తిస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కొంతమంది పార్టీ ఉండదని శాపనార్థాలు పెడుతున్నారని, అది మంచి పద్ధతి కాదన్నారు. తమ పార్టీకి ఒడిదొడుకులు కొత్తకాదని, ఒకసారి ఓడిపోగానే పార్టీల పని అయిపోతుందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ను ఉద్యమంలో కూడా చంపాలని చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారన్నారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ను లేకుండా చేయాలనే కుట్రలు సఫలం కావన్నారు. ఓడిపోయినంత మాత్రాన ఏదో జరుగుతుందని ఊహించుకోవద్దన్నారు.
బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలే కాపాడుకుంటారన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేశారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామన్నారు. బీఆర్ఎస్కు గొప్ప ఉద్యమ చరిత్ర ఉందని, త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ అన్నారు. ఉద్యమంలో భాగంగా అనేక సార్లు రాజీనామాలు చేసిన చరిత్ర తమ పార్టీకి ఉందన్నారు.
స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని, ఆ ఫలితాలు పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లా ఉండబోవన్నారు. ప్రజలు తెలివైన వారని, వచ్చే ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్కు 60 లక్షల మంది సభ్యత్వం ఉందని, ఆషామాషీగా తుడిచి పెట్టలేరన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ను కాపాడుకోవాలని ప్రజలకు తెలుసునన్నారు. దేశంలో అభివృద్ధికి తెలంగాణ రోల్ మోడల్ అయ్యిందన్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.