Water from urine: మూత్రం నుంచి తాగునీరు.. కొత్త స్పేస్సూట్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు!
- ప్రత్యేక సూట్లు ఆవిష్కరించిన అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు
- రెండు దశల ఆస్మాసిస్ ఫిల్టర్ ద్వారా నిమిషాల్లోనే మంచినీరు
- కొత్త రీసైక్లింగ్ విధానాన్ని రూపొందించామని వెల్లడి
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపే వ్యోమగాములు మూత్రవిసర్జన నిర్వహణ కోసం కొంతకాలంగా ప్రత్యేకంగా రూపొందించిన స్పేస్సూట్లను ఉపయోగిస్తున్నారు. సూట్ లోపల డిస్పోజబుల్ డైపర్లను ఉపయోగిస్తుంటారు. అయితే ఇకపై వ్యోమగాముల మూత్రం నుంచి నిమిషాల వ్యవధిలో తాగునీరు తయారు చేయవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మూత్రాన్ని తాగునీటిగా మార్చే కొత్త రీసైక్లింగ్ విధానాన్ని ఆవిష్కరించామని చెబుతున్నారు. ఈ మేరకు ‘న్యూ సైంటిస్ట్’ అనే సైన్స్ మ్యాగజైన్లో ఒక అధ్యయనం ప్రచురితమైంది.
మూత్రం నుంచి తాగు నీటిని తయారు చేసే సూట్‌ని ఆవిష్కరించామని న్యూయార్క్‌లోని కార్నెల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు. 8 కేజీల బరువు ఉంటే పరికరాన్ని రూపొందించామని, దానిని స్పేస్‌సూట్‌లో అమర్చాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ సూట్ రెండు దశల ఆస్మాసిస్ ఫిల్టర్ ద్వారా 87 శాతం సామర్థ్యంతో మూత్రాన్ని రీసైకిల్ చేయగలదని పేర్కొన్నారు.
పరిశోధనల్లో భాగంగా కొన్ని గంటల సమయం మాత్రమే స్పేస్‌వాక్ చేసే వ్యోమగాములకు తాము రూపొందించిన స్పేస్‌సూట్ చక్కటి పరిష్కారమని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే ఎక్కువ సమయం అంతరిక్షంలో గడిపేవారికి మరింత మెరుగైన పరిష్కారం అవసరం అవుతుందని అభిప్రాయపడ్డారు. కాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రస్తుతం ‘గరిష్ఠ శోషణ వస్త్రం’(పెద్ద వాళ్ల డైపర్ లాంటిది)పై ఆధారపడుతోంది. వ్యోమగాముల మూత్ర, మలాలు ఇందులోకి వెళతాయి. స్పేస్‌వాక్ ముగిశాక వీటిని ఐఎస్ఎస్ వ్యర్థ వ్యవస్థలో పడేస్తారు. ఆ తర్వాత అవి భూవాతావరణంలో కాలిపోతుంటాయి.