Chandrababu: చంద్రబాబుకు ఇచ్చిన మాట నెరవేరుస్తాం: 'అక్షయపాత్ర' అధ్యక్షుడు మధు పండిట్
మంగళగిరిలోని కొలనుకొండ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఇవాళ అనంత శేష స్థాపన కార్యక్రమం జరగ్గా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఆయనకు ఇస్కాన్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు పూజా కార్యక్రమాల్లోనూ, పూర్ణాహుతి కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వరస్వామి అని వెల్లడించారు. ప్రతి రోజూ తాను వెంకటేశ్వరస్వామికి దండం పెట్టుకుని... తెలుగుజాతికి సేవ చేయడానికి, పేదరికం లేకుండా చేయడానికి నాకు శక్తిసామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటానని తెలిపారు. పేదరికంలో ఉన్నవారికి చేయూతనివ్వడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.
పెనుగొండలో నాడు 108 అడుగుల ఏక రాతి విగ్రహంతో లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిర్మాణానికి ఇస్కాన్ ముందుకు వస్తే... ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని చంద్రబాబు ఆరోపించారు. గత ఐదేళ్లలో మంచి పనులు రద్దు చేయడం తప్ప మరొక పని చేయలేదని విమర్శించారు.
కాగా, చంద్రబాబు ప్రస్తావించిన ఏక రాతి విగ్రహంతో ఆలయ నిర్మాణంపై అక్షయపాత్ర ఫౌండేషన్ అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిట్ స్పందించారు. ఆయన కూడా మంగళగిరిలో నేడు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
"2019లో మీరు మా ఇస్కాన్ కి ఒక బాధ్యత అప్పగించారు. పెనుగొండలో 108 అడుగుల ఏక రాతి విగ్రహంతో లక్ష్మీనరసింహస్వామి ఆలయం నిర్మించమన్నారు. ఇప్పుడు మీకు మాటిస్తున్నాం... మీరు అప్పగించిన బాధ్యతను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని ఇస్కాన్ తరఫున ప్రకటిస్తున్నాం" అని చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్నారు.