Arvind Kejriwal: కేజ్రీవాల్ 8.5 కిలోలు తగ్గారు... షుగర్ లెవల్స్ తగ్గితే కోమాలోకి వెళ్లే ప్రమాదం!: ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్
- కేజ్రీవాల్‌ను వేధించాలని ఎన్డీయే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపణ
- కేజ్రీవాల్ అరెస్టయినప్పుడు 70 కిలోలు ఉండగా ఇప్పుడు 61.5కి తగ్గారని వెల్లడి
- షుగర్ లెవల్స్ పదేపదే తగ్గితే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని ఆందోళన
మద్యం పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 8.5 కిలోలు తగ్గారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. జైల్లో ఉండగా ఐదుసార్లు ఆయన బ్లడ్ షుగర్ పడిపోయిందన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కేజ్రీవాల్‌ను జైల్లో తీవ్రంగా వేధించేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇది అత్యంత ఆందోళనకరమైన అంశమన్నారు.
మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసిన తర్వాత ఏప్రిల్ 1 నుండి కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన సమయంలో కేజ్రీవాల్ 70 కిలోలు ఉన్నారని, ఇప్పుడు ఆయన బరువు 61.5 కిలోలకు తగ్గిందని తెలిపారు. జైల్లో కేజ్రీవాల్‌ను చిత్రహింసలు పెట్టడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. ఆయన జీవితంతో ఆడుకోవడమే మోదీ లక్ష్యమని మండిపడ్డారు.
కేజ్రీవాల్‌కు ఎలాంటి పరీక్షలు నిర్వహించకపోవడంతో బరువు ఎందుకు తగ్గుతున్నారో కారణం తెలియడం లేదన్నారు. బరువు తగ్గడం తీవ్రమైన అనారోగ్యానికి సంకేతమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బరువు తగ్గడమే కాకుండా ఐదుసార్లు షుగర్ లెవల్స్ పడిపోయాయన్నారు. ప్రతిసారి షుగర్ లెవల్స్ పడిపోతున్నాయంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.