Gudem Mahipal Reddy: బీఆర్ఎస్కు మరో షాక్... కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి?
- సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన పటాన్చెరు ఎమ్మెల్యే
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి రాక
- వరుసగా మూడుసార్లు విజయం సాధించిన మహిపాల్ రెడ్డి
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటి వరకు 9 మంది ఎమ్మెల్యేలు 'కారు' దిగి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి ఇంటికి వచ్చారు.
గూడెం మహిపాల్ రెడ్డి 2014, 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. వరుసగా రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్‌ను ఓడించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 7 వేల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించింది.
కాంగ్రెస్ నేతల వాట్సాప్ స్టేటస్
మహిపాల్ రెడ్డి కుమారుడు విక్రమ్ ఈరోజు కాంగ్రెస్ నేతలను తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నారు. 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలతో దిగిన ఫొటోలను స్టేటస్‌గా పెట్టుకున్నారు. రాహుల్ గాంధీ, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి ఫొటోలు ఇందులో ఉన్నాయి.