Ricky Ponting: హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌కు గుడ్‌బై చెప్పేసిన డీసీ!
- సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన డీసీ
- రికీ మార్గదర్శకత్వంలో ఏడేళ్లుగా డీసీ ఒక్క టైటిల్ గెలుచుకోకపోవడంపై అసంతృప్తి
- కోచ్ బాధ్యతలను కూడా టీం డైరెక్టర్ గంగూలీకి అప్పగించే ఛాన్స్
డీసీకి మార్గదర్శకుడిగా ఉన్న హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌కు టీం మేనేజ్మెంట్ గుడ్‌బై చెప్పేసింది. ‘‘బాధ్యత, విశ్వసనీయత, శ్రమకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చావు. నీ సారథ్యంలో వీటి ప్రతిబింబంగా నిలిచింది’’ అంటూ సోషల్ మీడియాలో డీసీ పేర్కొంది. అయితే, ఆస్ట్రేలియాను జగజ్జేతగా నిలిపిన రికీ పాంటింగ్ మార్గదర్శకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగా మారడంపై మేనేజ్మెంట్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని రికీకి ఎలాంటి మొహమాటాలు లేకుండా స్పష్టం చేసినట్టు తెలిసింది.
2018లో రికీ పాంటింగ్ డీసీ కోచ్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ తరువాత 2021లో డీసీ ఐపీఎస్ ఫైనల్స్‌కు చేరుకున్నప్పటికీ ఆ తరువాత మాత్రం ఆశించిన ఫలితంగా రాబట్టలేకపోయింది. ‘‘రికీ పనితీరుపై అసంతృప్తితో ఉన్నట్టు టీమ్ మేనేజ్మెంట్ నేరుగా చెప్పేసింది. గత ఏడేళ్లుగా ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టీం సపోర్టు స్టాఫ్‌లో మార్పులు ఉంటాయని పేర్కొంది. కాబట్టి వచ్చే ఏడాది రికీ కోచ్‌గా ఉండరు’’ అని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. ఆక్షన్ ప్రక్రియలో, టీం నిర్మాణం బాధ్యతలను రికీకి అప్పగించాలనేది టీం మేనేజ్మెంట్ ఆలోచనగా ఉన్నట్టు సమాచారం.
ఇక డీసీ కోచ్ బాధ్యతలను కూడా ప్రస్తుతం టీం డైరెక్టర్ గంగూలీకి కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే మాత్రం అదే పదవిలో కొనసాగనున్నారు. డీసీ కో ఓనర్స్, జేఎస్‌డబ్ల్యూ, జీఎమ్ఆర్ గ్రూప్ త్వరలో సమావేశం నిర్వహించనున్నాయి. ప్లేయర్ల కొనసాగింపు మొదలు పలు అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఓవర్సీస్ స్లాట్ ఒకటే అందుబాటులో ఉండటంతో ఆస్ట్రేలియా క్రీడాకారుడు జేక్ ఫ్రేజర్ లేదా దక్షిణాఫ్రికా క్రీడాకారుడు ట్రిస్టన్ స్టబ్స్‌లో ఎవరో ఒకర్ని వదులుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక కోర్ టీంకు సంబంధించి రిషభ్ పంత్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లను యథాతథంగా కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం.