Donald Trump: హత్యాయత్నం ఘటనపై తొలిసారి స్పందించిన డొనాల్డ్ ట్రంప్
- కుడి చెవి పైభాగంలోంచి బుల్లెట్ దూసుకెళ్లిందన్న ట్రంప్
- సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ రక్షించారని వెల్లడి
- ‘ట్రూత్ సోషల్ సైట్’ వేదికగా ట్రంప్ తొలిసారి స్పందన
ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో తనపై జరిగిన హత్యాయత్నంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందించారు. బుల్లెట్ కుడి చెవి పైభాగంలోంచి చొచ్చుకెళ్లిందని, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తనను రక్షించారని అన్నారు. గన్ షాట్ శబ్దాలు, షాట్లు వినిపించినప్పుడు ఏదో తప్పు జరుగుతున్నట్టు అనిపించిందని, అంతలోనే మరో బుల్లెట్ శరీరంలోకి దూసుకెళ్లినట్టు అనిపించిందని చెప్పారు. ఈ మేరకు తన ‘ట్రూత్ సోషల్ సైట్’ వేదికగా ట్రంప్ స్పందించారు. కాగా మాజీ అధ్యక్షుడు క్షేమంగానే ఉన్నారని, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని ట్రంప్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
కాగా పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతుండగా ఈ దాడి జరిగింది. వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు ర్యాలీకి హాజరయిన ఈ ర్యాలీలో వార్తా ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న సమయంలోనే కాల్పులు జరిగాయి. ఒక బుల్లెట్ ట్రంప్ చెవి నుంచి దూసుకెళ్లింది. రక్తం చింది ట్రంప్ ముఖంపై పడింది. వెంటనే ఆయన కిందకు వంగారు. రెప్పపాటులో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ వచ్చి ఆయనకు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.