Puri Ratna Bhandar: నేడు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం తలుపులు
- జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ నిర్ణయం మేరకు తెరుచుకోనున్న జగన్నాథుడి రత్నభాండాగారం
- రథయాత్ర కారణంగా జగన్నాథుడు ఆలయంలో లేని సమయంలో తలుపులు తెరిచేందుకు ఏర్పాట్లు
- లెక్కింపునకు పట్టే సమయం, ఎందురు పాల్గొంటారు వంటి విషయాల్లో రాని స్పష్టత
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారాన్ని అధికారులు నేడు తెరవనున్నారు. ఈ మేరకు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం తీసుకుంది. శ్రీక్షేత్రంలో జగన్నాథుడికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళల్లో సేవాయత్లు చేపడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలకు అంతరాయం కలగకూడదు.
ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. ఈ నె 19వ తేదీ వరకూ జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో అధికారులు చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది? ఎవరు పాల్గొంటారు? భాండాగారం మరమ్మతులు, లెక్కింపు ఒకేసారి జరగనుందా? తదితర వివరాలు వెల్లడవ్వలేదు. భాండాగారం తలుపులు తెరవడానికి ఎంతమంది వెళతారన్న దానిపై కూడా స్పష్టత లేదు. ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయడానికి మార్గదర్శకాలు జారీ కానున్నాయి. ఈసారి వివరాల నమోదును డిజిటలైజేషన్ చేయిస్తామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ పేర్కొన్నారు.