Harbhajan Singh: ప్రపంచ టాప్ త్రీ బ్యాట్స్ మెన్ లో కోహ్లీ, రోహిత్ కు చోటివ్వని హర్భజన్!
- మాజీ దిగ్గజాలు సచిన్, కలిస్, లారా వరల్డ్ టాప్ బ్యాటర్స్ గా తేల్చిన టర్బనేటర్
- కోహ్లీ, రోహిత్ కు తన జాబితాలో చోటిచ్చిన టీమిండియా మాజీ ఆల్ రౌండర్ రైనా
- వివియన్ రిచర్డ్స్, సచిన్, లారాను ఎంపిక చేసుకున్న మరో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప
టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తాను మెచ్చిన ముగ్గురు ప్రపంచశ్రేణి బ్యాట్స్ మెన్ ఎవరో వెల్లడించాడు. అయితే అందులో ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో అగ్రశ్రేణి ఆటగాళ్లుగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు మాత్రం చోటివ్వలేదు. అందుకు బదులుగా మాజీ దిగ్గజాలవైపే మొగ్గుచూపాడు.
ప్రపంచ టాప్ త్రీ బ్యాట్స్ మెన్ గా సచిన్ టెండూల్కర్, దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్వెస్ కలిస్, వెస్టిండీస్ మాజీ దిగ్గజం బ్రియాన్ లారాను ఎంపిక చేసుకున్నాడు. అలాగే టీమిండియాకు చెందిన మరో మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప తన దృష్టిలో ప్రపంచంలోని ముగ్గురు టాప్ బ్యాట్ మెన్ గా వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్, సచిన్ టెండూల్కర్, బ్రియన్ లారాను ఎంచుకున్నాడు. ఇక భారత జట్టు మాజీ ఆల్ రౌండర్ సురేష్ రైనా మాత్రం కోహ్లీ, రోహిత్ తోపాటు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు జో రూట్ ను ఎంపిక చేసుకున్నాడు.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాత్రం కోహ్లీ, లారాతోపాటు తమ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్ వైపు మొగ్గు చూపాడు. ‘రికార్డులు సృష్టించినందుకు సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియా క్రికెట్ పై తనదైన ముద్ర వేసినందుకు పాంటింగ్, ప్రేక్షకులకు అమితమైన ఉల్లాసాన్ని కలిగించినందుకు లారా’ తన దృష్టిలో ముగ్గురు ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లు అని ఫించ్ అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం నార్తాంప్టన్ లో వరల్డ్ చాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ ఆడుతున్న పలువురు మాజీ క్రికెటర్లను టీవీ వ్యాఖ్యాత షెఫాలీ బగ్గా ఈ ప్రశ్న అడిగింది. అందుకు వారు చెప్పిన జవాబులను ఒక వీడియోగా రూపొందించి తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.