TTF Vasan: బిగుసుకుంటున్న ఉచ్చు.. తిరుమల భక్తులకు తమిళ యూట్యూబర్ క్షమాపణలు
- తిరుమలలో క్యూలో ఉండగా ప్రాంక్ వీడియో తీసిన టీటీఎఫ్ వాసన్
- దానిని ఇన్స్టాలో షేర్ చేయడంతో తమిళనాడులో ఆందోళనలు
- విచారణకు ఆదేశించిన టీటీడీ విజిలెన్స్ విభాగం
- వాసన్ బృందం కోసం గాలిస్తున్న పోలీసులు
- మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయబోమని వీడియో విడుదల
- మనస్ఫూర్తిగా క్షమించాలని వేడుకోలు
తమిళనాడు యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ తిరుమల శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు నిన్న ఓ వీడియోను విడుదల చేశాడు. ఇటీవల శ్రీవారి దర్శనం కోసం స్నేహితులతో కలిసి వచ్చిన వాసన్ క్యూలో ఉండగా నారాయణగిరి షెడ్స్ కంపార్ట్మెంట్లో వేచి ఉన్నాడు. ఈ క్రమంలో భక్తులను వదిలేందుకు దాని తాళాలు తీస్తున్నట్టు హడావుడి చేస్తూ ప్రాంక్ వీడియో షూట్ చేశాడు.
అతడిని టీటీడీ సిబ్బందిగా భావించిన భక్తులు నిజంగానే కంపార్ట్మెంట్ తాళాలు తీస్తున్నాడని భావించారు. వారిని చూసి వెకిలిగా నవ్వుతూ వారు అక్కడి నుంచి తప్పుకున్నారు. ఈ వీడియోను వారు ఆ తర్వాత తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు.
ఈ వీడియోపై తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. టీటీడీ విజిలెన్స్ శాఖ విచారణకు ఆదేశించింది.
తన మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని భావించిన వాసన్ నిన్న క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశాడు. తాము కూడా శ్రీవారి భక్తులమేనని, భక్తుల ఇబ్బందులను చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీశామని, అయితే మిత్రుడి చర్యల కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకపై ఇలాంటి వీడియోలకు దూరంగా ఉంటామని, తమను మనస్ఫూర్తిగా క్షమించాలని వేడుకున్నాడు. కాగా, నిందితుల కోసం తిరుమల పోలీసులు గాలిస్తున్నారు.