KTR: ఉచితం అంటే దాని వెనుక భారీ మూల్యం ఉంటుందంటూ కేటీఆర్ హెచ్చరిక
- మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆసక్తికర ట్వీట్
- బస్సు ఛార్జీల పెంపు మరెంతో దూరంలో లేదని వ్యాఖ్య
- కర్ణాటకలో ఆర్టీసీ నష్టాల పాలైందనే వార్తను ట్వీట్ చేసిన కేటీఆర్
తెలంగాణలో రేవంత్ సర్కారు అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితం ఎప్పటికీ ఉచితం కానే కాదని, దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రజలను హెచ్చరించారు. తెలంగాణలో త్వరలోనే బస్సు ఛార్జీలు పెరుగుతాయని జోస్యం చెప్పారు. దీనికి మహిళలకు ఉచిత ప్రయాణం పథకమే కారణమని ఆరోపించారు. ఈ పథకాన్ని మనకన్నా ముందు కర్ణాటక ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని గుర్తుచేశారు. ఈ పథకం వల్ల కర్ణాటక ఆర్టీసీ తీవ్ర నష్లాలపాలైందని, బస్సు ఛార్జీలు పెంచడం మినహా గత్యంతరంలేదని అక్కడి అధికారులు చెప్పారన్నారు.
కేఎస్ ఆర్టీసీ సుమారు రూ.295 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందనే వార్తా కథనాలను కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం బస్సు ఛార్జీలను పెంచేందుకు సిద్ధమవుతోందని తెలిపారు. త్వరలోనే మన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. ‘ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీకు ఫ్రీ అని చెబితే వారు మిమ్మల్ని రైడ్ కు తీసుకెళుతున్నట్లే. ఉచితం అనే పదం వెనక భారీ ధర ఉంటుంది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.