BCCI: మాజీల విజ్ఞప్తులకు స్పందించిన బీసీసీఐ.. అన్షుమన్ గైక్వాడ్ కు ఎంత సాయం చేసిందంటే..!
- తక్షణమే రూ. కోటి విడుదలకు నిర్ణయం
- కార్యదర్శి జై షా ఆదేశం.. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ వెల్లడి
- గైక్వాడ్ కోలుకోవడానికి అవసరమైన చర్యలన్నీ చేపడతామని ప్రకటన
క్యాన్సర్ బారిన పడి లండన్ లో చికిత్స పొందుతున్న టీమిండియా 1983 వరల్డ్ కప్ జట్టు సభ్యుడైన అన్షుమన్ గైక్వాడ్ కు ఆర్థిక సాయం చేసేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ముందుకొచ్చింది. గైక్వాడ్ ను ఆదుకోవాలంటూ కపిల్ దేవ్, సందీప్ పాటిల్ లాంటి మాజీ క్రికెటర్లు చేసిన విజ్ఞప్తులకు స్పందించింది.
ఆయన చికిత్స కోసం తక్షణమే కోటి రూపాయాలను అందించాలని నిర్ణయించింది. ‘గైక్వాడ్ వైద్య ఖర్చుల కోసం తక్షణమే రూ. కోటి విడుదల చేయాలని బీసీసీఐ కార్యదర్శి జై షా ఆదేశించారు. ఇప్పటికే గైక్వాడ్ కుటుంబంతో షా మాట్లాడారు. ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో గైక్వాడ్ కుటుంబానికి బీసీసీఐ అండగా ఉంటుంది. ఆయన త్వరగా కోలుకోవడానికి అవసరమైన చర్యలన్నీ చేపడుతుంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తుంది. ఆయన ఈ పరిస్థితి నుంచి బలంగా బయటపడతారని నమ్ముతున్నారని ఆశిస్తున్నాం’ అని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది.
టీమిండియా మాజీ కెప్టెన్ డీకే గైక్వాడ్ కుమారుడైన అన్షుమన్ గైక్వాడ్ ప్రస్తుతం లండన్ లోని కింగ్స్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 71 ఏళ్ల గైక్వాడ్ 1975 నుంచి 1987 మధ్య టీమిండియా తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడారు.