Puri Ratna Bhandar: పూరి ‘రత్న భాండాగారం’లో పాములు కనిపించాయా?.. లోపలికి వెళ్లిన హైకోర్ట్ జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు
- పాములు కాపలా ఉన్నాయనే ప్రచారాన్ని ఖండించిన జడ్జి బిశ్వనాథ్ రాత్
- రత్న భాండాగారం చుట్టూ అనేక అపోహలు ఉన్నాయని వ్యాఖ్య
- ఆయన పర్యవేక్షణలోనే భాండాగారం మూడవ గది తలుపులు తెరచిన ప్రత్యేక బృందం
యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన పూరి జగన్నాథుడి ‘రత్న భాండాగారం’ తెరిచే ప్రక్రియ ఆదివారం విజయవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే. ఒడిశా హైకోర్ట్ జడ్జి బిశ్వనాథ్ రాత్ పర్యవేక్షణలో 11 మంది సభ్యుల ప్రత్యేక బృందం రత్న భాండాగారంలోని మూడవ గదిని తెరిచి అందులోని నగలను ఆరు ప్రత్యేక పెట్టెలలో పెట్టి బయటకు తీసుకొచ్చారు. అయితే భాండాగారంలోని మూడవ గది తలుపులు తెరవకముందు చాలా ప్రచారాలు జరిగాయి. ఆ గదికి నాగబంధం ఉందని, గదిలోని నగలకు పాములు కాపలా కాస్తున్నాయని చర్చ జరిగింది. అయితే రత్న భాండాగారంలోని మూడవ గది తలుపు తెరిచే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించిన జడ్జి బిశ్వనాథ్ రాత్ ఈ ప్రచారాన్ని ఖండించారు. రత్న భాండాగారం చుట్టూ అనేక అపోహలు, కథనాలు చక్కర్లు కొడుతున్నాయని ఆయన అన్నారు.
11 మంది సభ్యుల బృందం తాళాలు కత్తిరించి లోపలికి ప్రవేశించిందని చెప్పారు. రత్న భాండాగారంలోని ఆభరణాల సంపదను పరిశీలించిన అనంతరం ఆయన ఈ మేరకు ఆదివారం మీడియాకు వివరించారు. భాండాగారం మరింత తనిఖీ చేసేందుకు, ఆభరణాలను మార్చడానికి ఎక్కువ సమయం దక్కలేదని, అందుకే దేవత ఆభరణాలు, విలువైన రాళ్లను బయటకు తీసుకొచ్చేందుకు మరొక తేదీని నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. కాగా పొద్దుపోవడంతో ఆభరణాల విలువ లెక్కింపును కూడా వాయిదా వేసిన విషయం తెలిసిందే.