Chandrababu: బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రాంతాన్ని కూడా వదల్లేదు: సీఎం చంద్రబాబు
- సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- వైసీపీ పాలనలో ఖనిజ సంపద దోపిడీకి గురైందని వెల్లడి
- మైనింగ్, క్వారీ లీజుల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణ
- ఇసుక విధానంలో తప్పుడు పద్ధతులు అవలంబించారని విమర్శలు
- మడ అడవులను కూడా ధ్వంసం చేశారని ఆగ్రహం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సహజ వనరుల దోపిడీ అంశంపై శ్వేతపత్రం విడుదల చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో ఖనిజ సంపద దోపిడీకి గురైందని వెల్లడించారు. మైనింగ్, క్వారీ లీజుల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. కర్నూలు జిల్లాలో రవ్వలకొండ ఉంది... బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రాంతం... దాన్ని కూడా కొట్టేశారు... ఒక చారిత్రక ప్రదేశం... దీని జోలికి వెళ్లకూడదు అనే విచక్షణ కూడా లేకుండా దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు.
ఇసుక అంశంలో తప్పుడు విధానం తెచ్చి, ఇష్టానుసారం దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. అక్రమ ఇసుక తవ్వకాల ద్వారా ప్రభుత్వానికి రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఖనిజాల తవ్వకాల్లోనూ ప్రభుత్వానికి రూ.1000 కోట్లకు పైగా నష్టం జరిగిందని అన్నారు.
అదే సమయంలో ప్రత్యర్థులు మైనింగ్ ను ఆపివేయించడం, జరిమానాలు వేయించడం వంటి చర్యలకు పాల్పడ్డారని, అటవీభూముల్లో లీజు లేకుండానే మైనింగ్ కు చేశారని ఆరోపించారు. గనుల కేటాయింపులో మొదట వచ్చిన వారికి మొదట నిబంధనలకు తూట్లు పొడిచారని, పర్యావరణ నిబంధనలు పాటించకుండా మైనింగ్ చేపట్టారని విమర్శించారు. ఓ పద్దతి లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టి, పర్యావరణానికి హాని కలిగించడంపై సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసిందని తెలిపారు.
అడవులను కూడా వీరి దోపిడీకి వేదికలుగా చేసుకున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణా, అటవీభూముల్లో ఖనిజాల తవ్వకం, అటవీ భూముల ఆక్రమణ, ఇళ్ల నిర్మాణం కోసం మడ అడవుల ధ్వంసం వంటి అక్రమాలు గత ప్రభుత్వ హయాంలో జరిగాయని చంద్రబాబు వివరించారు.
"ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలను తీసుకువచ్చారు. ఇసుక తవ్వకాల్లో అక్రమంగా భారీ యంత్రాలను ఉపయోగించారు. ఇసుక తవ్వకాల కోసం నదులు, కాలువల మీద కూడా రోడ్లు వేసే పరిస్థితికి వచ్చారు. అధికారులను డిప్యుటేషన్ పై తెచ్చుకుని మరీ అక్రమాలకు పాల్పడ్డారు. ఇసుక అక్రమాలను ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడలేదు.
కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో భారీగా ఇసుక దందాలు నడిచాయి. వైసీపీ నేతలకు కప్పం కట్టలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
సాధారణంగా అటవీ శాఖను, గనుల శాఖను ఒకే వ్యక్తి ఇవ్వరు... కానీ వైసీపీ హయాంలో ఈ రెండు శాఖలను ఒకే వ్యక్తికి అప్పగించారు. తూర్పు గోదావరి జిల్లాలో లేటరైట్ గనులను బలవంతంగా లాక్కున్నారు... ప్రకాశం జిల్లాలో 250 క్వారీలపై దాడులు చేశారు. చిత్తూరు జిల్లాలో టార్గెటెడ్ ఇన్ స్పెక్షన్ల పేరుతో వేధింపులకు పాల్పడ్డారు. ఆఖరికి ద్రవిడ యూనివర్సిటీలో సైతం అక్రమ మైనింగ్ జరిగిందంటే వీళ్ళు ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు.
ఎర్రచందనాన్ని వీళ్లే స్మగ్లింగ్ చేసుకుని వేరే దేశాలకు, ముఖ్యంగా చైనాకు తీసుకెళ్లేవారు. స్మగ్లింగ్ అనేది చాలా ప్రమాదకరమైనది. స్మగర్లను ఎంకరేజ్ చేయడం అనేది డేంజరస్ ట్రెండ్. ఇక, పుంగనూరు, కార్వేటినగరం ప్రాంతాల్లో 6.725 ఎకరాల అటవీభూముల్లో మైనింగ్ కు అనుమతులు ఇచ్చారు. పల్నాడు ఏరియాలో ఇష్టానుసారం అడవుల నరికివేతకు పాల్పడ్డారు. ఇలాంటివి ఒకట్రెండు కాదు చాలా ఉన్నాయి.
అదే సమయంలో కాకినాడ జిల్లాలో 58 ఎకరాల మేర మడ అడవులను ధ్వంసం చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తే ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5 కోట్ల జరిమానా కూడా వేసింది" అని చంద్రబాబు వివరించారు.