Janasena: ఏపీలో అత్యధిక ఓట్ల శాతంతో గెలిచింది జనసేన అభ్యర్థి శ్రీనివాస్: ఏపీ ఫలితాలపై ఏడీఆర్ నివేదిక
- నియోజకవర్గంలో 70.23 శాతం ఓట్లు సాధించిన వంశీకృష్ణ శ్రీనివాస్
- మహిళల్లో 64.21 శాతం ఓట్లు సాధించిన అదితి విజయలక్ష్మి
- టెక్కలిలో నోటాకు అత్యధికంగా 3.79 శాతం ఓట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన వారు ఎవరో తెలుసా? విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గెలిచిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఏడీఆర్ విశ్లేషించింది. వంశీకృష్ణ శ్రీనివాస్ తన నియోజకవర్గంలో 70.23 శాతం ఓట్లు సాధించారు. ఆయా నియోజకవర్గాల్లో అత్యధిక ఓట్లు పొందిన వారిని వెల్లడించింది.
మహిళా ఎమ్మెల్యేల్లో విజయనగరం (టీడీపీ) నుంచి విజయం సాధించిన అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఉన్నారు. ఆమె 64.21 శాతం ఓట్లను సాధించారు. పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు 69.30 శాతం, గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి 61.58 శాతం, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ 68.99 శాతం, కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి 60.68 శాతం, గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు 67.30 శాతం, పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష 60.44 శాతం ఓట్లు సాధించారు.
తక్కువ ఓట్లతో గెలుపొందిన వారు....
మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు 0.19 శాతం ఓట్లతో, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి 0.47 శాతం ఓట్లతో మాత్రమే గెలిచారు. 175 మంది ఎమ్మెల్యేలలో 22 మంది మహిళలు ఉన్నారు. సగటున వీరికి 40 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి.
ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు?
ఈ ఎన్నికల్లో టీడీపీకి 45.60 శాతం ఓట్లు రాగా, వైసీపీకి 39.37 శాతం, జనసేనకు 6.87 శాతం, బీజేపీకి 2.83 శాతం, కాంగ్రెస్కు 1.72 శాతం, నోటాకు 1.09 శాతం, బీఎస్పీకి 0.60 శాతం, సీపీఎంకు 0.13 శాతం, సీపీఐకి 0.04 శాతం, ఇతర పార్టీలకు 1.75 శాతం ఓట్లు వచ్చాయి. టెక్కలి నియోజకవర్గంలో నోటాకు అత్యధికంగా 3.79 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత సాలూరులో 3.69 శాతం, రంపచోడవరంలో 3.45 శాతం ఓట్లు వచ్చాయి.