Nizamabad District: బంధువులు దుష్ప్రచారం చేస్తున్నారని.. రైలు కిందపడి యువ దంపతుల ఆత్మహత్య
- నిజామాబాద్ జిల్లాలో ఘటన.. ఏడాది క్రితమే వివాహం
- తాను చేసిన తప్పును భర్త క్షమించినా, బంధువులు దుష్ప్రచారం చేస్తున్నారంటూ బాధిత మహిళ వీడియో
- వీడియోను కోటగిరి ఎస్సైకి పంపి రైలు పట్టాలపై ఆత్మహత్య
- పోలీసులు అప్రమత్తమైనా నిలవని ప్రాణాలు
బంధువుల దుష్ప్రచారంతో మనస్తాపం చెందిన యువ దంపతులు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అంతకు ముందువారు చనిపోతున్నట్టు ఓ వీడియోను రికార్డు చేసి పోలీసులకు పంపించారు. పోలీసులు అప్రమత్తమైనప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన.
జిల్లాలోని పొతంగల్ మండలం హెగ్డోలి గ్రామానికి చెందిన అనిల్ (28), పొతంగల్‌కు చెందిన శైలజ (24)కు ఏడాది క్రితం వివాహమైంది. ఇంటర్వ్యూకు వెళ్తున్నట్టు కుటుంబ సభ్యులకు చెప్పి సోమవారం వారు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత.. తాను చేసిన ఓ తప్పును భర్త క్షమించినా బంధువులు మాత్రం వదలడం లేదని, దుష్ప్రచారం చేస్తున్నారని, అది భరించడం తమ వల్ల కావడం లేదని, గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నామని చెబుతూ శైలజ ఓ వీడియోను రికార్డు చేసి కోటగిరి ఎస్సై సందీప్‌కు పంపింది.
అప్రమత్తమైన ఆయన వెంటనే నవీపేట ఎస్సైకి ఆ వీడియోను, వారి ఫోన్ నంబర్‌ను పంపారు. అక్కడి నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో వారు వెంటనే బాసర వంతెన వద్దకు వెళ్లి గాలించారు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో వారి ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేశారు. ఫకీరాబాద్-మిట్టాపూర్ మధ్య లొకేషన్ చూపించడంతో అక్కడికి వెళ్లి చూడగా పట్టాలపై అనిల్, శైలజ మృతదేహాలు కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.