Ukrainian: రష్యాపై పోరుకు రోబో ఆర్మీని సిద్ధం చేస్తున్న ఉక్రెయిన్
- సైనిక కొరతకు విరుగుడుగా వందలాది రోబోల తయారీ
- ఉక్రెయిన్ లో పెరుగుతున్న డిఫెన్స్ స్టార్టప్ లు
- విదేశాల సాయంతో రహస్య స్థావరాల్లో రోబోల తయారీ
అసలే చిన్నదేశం.. సైనిక బలం అంతంతే. తలపడుతున్న శత్రువేమో ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలలో ఒకటి. నింగి, నేల, సముద్రం.. ఇలా మూడువైపుల నుంచి విరుచుకుపడుతోంది. ఫలితం.. పెద్ద సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు.. మరికొందరు గాయాలతో యుద్ధరంగం నుంచి నిష్క్రమిస్తున్నారు. సాధారణ పౌరులూ పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. విదేశాల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఎంతోకొంత అందుతున్నప్పటికీ వాటిని ఉపయోగించేందుకు సైనికులే కరవవుతున్నారు. రోజురోజుకూ సైనికుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. అయితే, ఉక్రెయిన్ దీనికి వినూత్న పరిష్కారం కనుగొంది. టెక్నాలజీ సాయంతో రోబో ఆర్మీని సిద్ధం చేస్తోంది. యుద్ధ ట్యాంకర్లకు సెన్సర్లు అమర్చి, వాటికవే శత్రువుతో పోరాడేలా తీర్చిదిద్దుతోంది. శత్రువులను వెదుక్కుంటూ వెళ్లి తనకు తానుగా పేల్చేసుకునే రోబోలను తయారుచేస్తోంది. ఇందుకోసం దేశంలోని దాదాపు 250 స్టార్టప్ లు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. పైకి సాధారణ ఆటోమొబైల్ షాపులా, మెకానిక్ గ్యారేజీలా కనిపించే షాపులలో రహస్యంగా ఈ మెషీన్ల తయారీ కొనసాగుతోంది.
మినీ యుద్ధట్యాంకులు..
ఓ అంతర్జాతీయ మీడియాకు ఉక్రెయిన్ డిఫెన్స్ స్టార్టప్ లలో ఒకటైన వీరియ్ అనే డ్రోన్ కంపెనీ సీఈవో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తాము తయారుచేస్తున్న కిల్లింగ్ మెషిన్ల గురించి చెప్పుకొచ్చారు. అయితే, తమ కంపెనీ లొకేషన్ ను మాత్రం రహస్యంగా ఉంచాలని ఆయన కోరారు. వీరియ్ కంపెనీ సీఈవో చెప్పిన వివరాల ప్రకారం.. ఈ కంపెనీ ఒడిస్సే పేరుతో ఓ మానవరహిత యుద్ధ వాహనాన్ని సిద్ధం చేసింది. మినీ యుద్దట్యాంకును తలపించేలా దాదాపు కారు పరిమాణంలో దీనిని తీర్చిదిద్దింది. బ్యాటరీతో నడిచే ఈ వాహనం బరువు 800 కిలోలు. ఒక్కసారి చార్జ్ చేస్తే 30 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
తక్కువ ఖర్చుతో తయారీ..
కెమెరాలు, సెన్సర్ల సాయంతో ఆటోమేటిక్ గా ముందుకు వెళ్లేలా తయారుచేసిన ఈ వాహనాన్ని రిమోట్ తోనూ కంట్రోల్ చేయవచ్చు. కీవ్ శివార్లలోని పంటపొలాల్లో ఈ వాహనాన్ని పరీక్షించి చూశారు. ఒడిస్సేపై అమర్చిన మెషిన్ గన్ తో ఆటోమేటిక్ గా దాడులు చేయవచ్చు, దీంతోపాటు యుద్ధరంగంలో గాయపడిన, చిక్కుకుపోయిన సైనికులను కాపాడే అవకాశం ఉంటుందని వీరియ్ కంపెనీ సీఈవో చెప్పారు. విదేశాల నుంచి ఈ తరహా వాహనాన్ని దిగుమతి చేసుకోవడానికి అయ్యే ఖర్చులో కేవలం 10 వ వంతు సొమ్ముతో తయారుచేయడం దీని ప్రత్యేకత. దీనికి వీరియ్ కంపెనీ నిర్ణయించిన ధర కేవలం 35 వేల డాలర్లు మాత్రమే.
డిఫెన్స్ మ్యాగజైన్లు, ఆన్ లైన్ వీడియోలే స్ఫూర్తి..
ఆటోమేటిక్ యుద్ధ వాహనాలను తయారుచేయాలనే ఆలోచన ఎలా వచ్చిందన్న ప్రశ్నకు వీరియ్ కంపెనీ సీఈవో జవాబిస్తూ.. డిఫెన్స్ మ్యాగజైన్లలో వివిధ యుద్ధ వాహనాల వివరాలు, ఆన్ లైన్ వీడియోల నుంచి స్ఫూర్తి పొందామని చెప్పారు. వాటికి తమ ఊహలను జోడించి ఈ వినూత్న ఆయుధాలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. యుద్ధం కారణంగా విదేశాల నుంచి దిగుమతులు తగ్గిపోవడంతో తమకు అందుబాటులో ఉన్న వనరులతోనే వీటిని డిజైన్ చేస్తున్నామని వివరించారు. అదీ అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక వాహనాలను తయారుచేస్తున్నట్లు చెప్పారు. తేలికపాటి కలపతో డ్రోన్ల రెక్కల తయారీ, సూపర్ మార్కెట్లలో వాడే ‘కేబుల్ టై’లతో డ్రోన్లకు మందుగుండు సామగ్రిని కట్టి, సరిహద్దులకు పంపి పేల్చేయడం తదితర పద్ధతులను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.
ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లు..
సాధారణ డ్రోన్లకు వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ జోడించి తయారుచేసినవే ఈ ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లు.. వీటికి స్పెషల్ గా అమర్చిన కెమెరాలకు వీఆర్ కళ్లజోడును అనుసంధానించి డ్రోన్ కు ముందున్న పరిసరాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కలుగుతుంది. తద్వారా డ్రోన్ అటాక్ కు సరైన స్థలాన్ని ఎంపిక చేయొచ్చు. రహస్య స్థావరంలో కూర్చుని గురి తప్పకుండా శత్రువుపై దాడి చేసే అవకాశం ఈ డ్రోన్ల ద్వారా కలుగుతుంది.
ఏఐ ఆధారిత ఆటోమేటెడ్ గన్..
డేవ్డ్రాయిడ్ అనే స్టార్టప్ ఈ ఆటోమేటెడ్ గన్ ను తయారుచేసింది. కదిలే టార్గెట్లను గుర్తించి గురి తప్పకుండా కాల్పులు జరపొచ్చు. ఆటోమేటెడ్ గన్ అయినప్పటికీ కాల్పులు జరపాలా? వద్దా? అనేది దీనిని ఆపరేట్ చేసే సైనికుడే నిర్ణయిస్తాడు. ఈ స్టార్టప్ లకు తోడు సాధారణ ప్రజలు కూడా డ్రోన్లు, ఆయుధాల తయారీకి సంబంధించిన ఆన్ లైన్ కోర్సులు నేర్చుకోవాలని ఉక్రెయిన్ ఉప ప్రధాని మిఖాయిలో ఫెదొరోవ్ పిలుపునిచ్చారు. తద్వారా డ్రోన్ల తయారీలో వేగం పెంచాలనేది ఫెదొరోవ్ ఆలోచన. యుద్దరంగంలో కృత్రిమ మేధ వాడడంపై ఐరాస, మానవ హక్కుల సంస్థలు అభ్యంతరం చెబుతున్నాయి. అయితే, రష్యాపై గెలవడమే తమ లక్ష్యమని, అందుకు వీలైనంతా చేస్తామని ఫెదరోవ్ చెబుతున్నారు. యుద్ధరంగంలో తమ సైనికులను కాపాడుకోవడానికి ఏఐ ఆధారిత ఆయుధాలను ఉపయోగించడం మినహా తమకు వేరే ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు.