AP Cabinet: ముగిసిన ఏపీ క్యానెబిట్ సమావేశం.... ఆమోదించిన నిర్ణయాలు ఇవే!
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు క్యాబినెట్ ఆమోదం
- కొత్త ఇసుక విధానం అమలుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్
- ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముగిసింది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానం అమలుకు ఆమోదం లభించింది. నూతన ఇసుక పాలసీ అమలు కోసం త్వరలోనే విధివిధానాలు రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ రూ.2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం లభించింది.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ఎన్సీడీసీ నుంచి రూ.3,200 కోట్ల రుణానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రుణం తీసుకునేందుకు వ్యవసాయ, సహకార కార్పొరేషన్ కు ప్రభుత్వ గ్యారంటీకి క్యాబినెట్ సమ్మతి తెలిపింది.
కాగా, పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపు, విధివిధానాల ఖరారుకు కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ముగ్గురు మంత్రులతో కమిటీ నియమించారు. ఈ కమిటీలో అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్ ఉన్నారు.
రెండ్రోజుల్లో చర్చించి, అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని కమిటీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రీమియం చెల్లింపు స్వచ్ఛందంగా రైతులు చేయాలా? లేక, ప్రభుత్వం చెల్లించాలా? అనే అంశాన్ని ఖరారు చేయాలని కమిటీకి నిర్దేశించారు. రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇక, సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలపై ప్రధానంగా చర్చ జరిగింది.
ఇక, ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నేటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు.