Vijayasai Reddy: మదన్ కు విజయసాయిరెడ్డి అంత డబ్బు ఎందుకిచ్చాడు?... విజిలెన్స్ విచారణ జరపాలి: ఆనం వెంకటరమణారెడ్డి
విజయసాయిరెడ్డి, శాంతి వ్యవహారంపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. నిన్న శాంతి భర్త మదన్ మోహన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఆనం ప్రస్తావించారు. మదన్ మోహన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి, కేంద్ర విజిలెన్స్ శాఖ రంగంలోకి దిగి విచారణ చేపట్టాలని అన్నారు.
మదన్ మోహన్... హైదరాబాదులో విజయసాయి ఇంటికి వెళ్లాడా, లేదా? అక్కడ్నించి వైజాగ్ వచ్చాడా, లేదా? అనేదానిపై గూగుల్ టేకౌట్ తీయాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి ఆమెకు ఎందుకు డబ్బులు ఇచ్చారు? ఆమెతో విశాఖలో ఏమేం పనులు చేయించుకున్నారు? ఏ భూములు కొట్టేశారు? అనే విషయాలు విచారణ చేస్తే బయటికి వస్తాయని అన్నారు. అందుకే విజిలెన్స్ విచారణ అడుగుతున్నామని ఆనం వెంకటరమణారెడ్డి చెప్పారు.
''విశాఖను దోచుకున్నది విజయసాయిరెడ్డేనని దీంతో అర్థమైపోయింది. ఒక పార్లమెంటు సభ్యుడు తనకు రూ.1.60 కోట్లు ఇచ్చాడని ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి చెబుతున్నాడు. దీనిపై సీబీఐ విచారణ కూడా వేయాలని అడుగుతున్నాం. విజయసాయిరెడ్డి తనకు డబ్బు ఇచ్చాడని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒప్పుకున్న తర్వాత విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. రెండు లాఠీ దెబ్బలు తగిలిస్తే అన్ని నిజాలు బయటికి వస్తాయి" అని అనం పేర్కొన్నారు.
ఇక, శాంతి వ్యవహారంలో తనకేమీ తెలియదని విజయసాయిరెడ్డి అంటున్నారని, అలాంటప్పుడు విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్టు చేయించుకోవాలని ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. డీఎన్ఏ టెస్టుకు విజయసాయి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. డీఎన్ఏ టెస్టులో ఏమీ లేకపోతే మంచిదే కదా అని వ్యాఖ్యానించారు.