Thummala: ఆ రైతులకు మంత్రి తుమ్మల గుడ్న్యూస్... ఎల్లుండి వారి ఖాతాల్లో నగదు జమ
- ఈ నెల 18న రూ.1 లక్ష వరకు రుణమాఫీ చేస్తామన్న మంత్రి
- 30 లక్షల మంది రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరమని వెల్లడి
- గోల్డ్ లోన్ తీసుకున్న రైతులకు పాస్ బుక్ ఉంటే రుణమాఫీ చేస్తామన్న మంత్రి
తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు శుభవార్త చెప్పారు. ఎల్లుండి రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులను జమ చేస్తామని తెలిపారు. ఈ నెల 18న రూ.1 లక్ష వరకు ఉన్న వారికి రుణమాఫీ చేస్తామన్నారు. రైతుల ఖాతాల్లో ఈ నెల 18న రూ.6 వేల కోట్లకు పైగా జమ చేస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా 30 లక్షల మంది రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరమన్నారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్నట్లే పాత పద్ధతిలో రుణమాఫీ చేయబోతున్నామన్నారు. గతం కంటే భిన్నంగా రుణమాఫీ చేయబోవడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేసినప్పుడు రైతు వడ్డీలకే అది సరిపోయిందని విమర్శించారు. కుటుంబ నిర్ధారణ చేయాలంటే రేషన్ కార్డు డేటా అవసరమన్నారు.
60 లక్షల మంది ఖాతాదారుల్లో 6 లక్షల మందికి రేషన్ కార్డులు లేవని, రేషన్ కార్డులు లేని కుటుంబాల దగ్గరకు అధికారులు వెళ్లి నిర్ధారణ చేస్తారన్నారు. 39 లక్షల కుటుంబాలు ఇప్పటి వరకు పంట రుణాలను తీసుకున్నట్లు చెప్పారు. బ్యాంకుల్లో బంగారం పెట్టి క్రాఫ్ లోన్లు తీసుకున్న రైతులకు పాస్ బుక్ ఉంటే రుణమాఫీ చేస్తామన్నారు.