Bengaluru: ధోవతి ధరించాడని మాల్‌లోకి అనుమతించని సిబ్బంది!
- సినిమా చూడటం కోసం టిక్కెట్ తీసుకున్న తండ్రీకొడుకులు
- సమయం దొరకక కొడుకుతో నేరుగా మాల్‌కు ధోవతీతో వచ్చిన తండ్రి
- లోపలి అనుమతించని భద్రతా సిబ్బంది
బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ధోవతి ధరించి వచ్చిన వృద్ధుడిని ఓ మాల్లో లోనికి రానివ్వలేదు. ప్యాంట్ వేసుకొని వస్తేనే అనుమతిస్తామని సెక్యూరిటీ సిబ్బంది ఆయనతో నిక్కచ్చిగా చెప్పడంతో విస్తుపోవడం అతని వంతయింది. ఈ ఘటన బెంగళూరులోని జీటీ మాల్లో చోటు చేసుకుంది.
వృద్ధుడితో పాటు అతని కొడుకు కూడా మాల్కి వచ్చాడు. కొడుకు ఎంత నచ్చజెప్పినా భద్రతా సిబ్బంది వినలేదు. తన తండ్రిని లోనికి అనుమతించాలని ఆ కొడుకు విజ్ఞప్తి చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సదరు మాల్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. సినిమా కోసం వారు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో వారు మాల్ ప్రవేశద్వారం ద్వారా లోనికి వెళుతుండగా భద్రతా సిబ్బంది ఆ తండ్రీకొడుకులను నిలిపివేశారు. మాల్ నిబంధనల ప్రకారం ధోవతి ధరించిన వారికి లోనికి అనుమతి లేదని సెక్యూరిటీ సిబ్బంది వారితో చెప్పినట్లుగా తెలుస్తోంది.
తన తండ్రి దూర ప్రాంతం నుంచి వచ్చారని, అప్పటికప్పుడు దుస్తులు మార్చుకునే సమయం దొరకలేదని, అందుకే వచ్చామని చెప్పినప్పటికీ సిబ్బంది వినలేదు. కచ్చితంగా ప్యాంట్ మార్చుకొని వెళ్లాల్సిందేనని సూచించారట. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వృద్ధుడికి ఇచ్చే గౌరవం ఇదా? అని కామెంట్ చేస్తున్నారు.
ఈ అంశంపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ధోవతి ధరించినందుకు రైతులను తిట్టడం, అవమానించడం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి ధోవతి ధరిస్తారు కానీ... మాల్‌లోకి రైతును ధోవతితో అనుమతించరా? అన్నారు. 'ధోవతి మా దర్పం' అని ఆయన పేర్కొన్నారు.