Vijayasai Reddy: మంచి, మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే నేను నేర్పిస్తా: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy tweets on recent developments

  • కొన్నిరోజులుగా విజయసాయిరెడ్డిపై మీడియాలో కథనాలు
  • భగ్గుమంటున్న విజయసాయిరెడ్డి
  • కొన్ని మీడియా సంస్థలపైనా, మంత్రి లోకేశ్ పైనా ఆగ్రహం

మీడియాలో, సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారం పట్ల వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భగ్గుమంటున్నారు. ముఖ్యంగా, కొన్ని మీడియా సంస్థలపైనా, మంత్రి నారా లోకేశ్ పైనా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తాజాగా లోకేశ్ ను ఉద్దేశించి విజయసాయి ట్వీట్ చేశారు. 

"నారా లోకేశ్... నేను మీడియా ప్రతినిధులను ఎప్పుడూ తిట్టలేదు. మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తుల గురించి మాత్రమే మాట్లాడాను. నా మాటలను తప్పుదారి పట్టించవద్దు. అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్లీ వినండి. మంచి, మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే నేను నేర్పిస్తాను. మీ భాష ఏమిటో మీకు తెలియాలంటే గత 20 నెలల మీ వీడియోలను మీరే చూసుకోండి. పెద్దల సభ సభ్యుడితో మాట్లాడే తీరు ఇదేనా?" అంటూ ధ్వజమెత్తారు. 

"నారా లోకేశ్... రాష్ట్రంలో విద్యారంగం దారి తప్పింది. పాలకులు మాట తప్పుతున్నారు. స్కాలర్షిప్ లు రాలేదు, హాస్టళ్లు లేవు. అక్రమ బదిలీలు జరుగుతున్నాయి. విద్యారంగంపై తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. ముందు దానిపై దృష్టి పెట్టండి. 

ఈ మధ్య 40 రోజులుగా జరుగుతున్న నేరాలు, ఘోరాలకు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారు? వీటిపై కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా! అధికారం ఇస్తే 24 గంటల్లో న్యాయం అన్నారు... సుగాలి ప్రీతి ఏమైంది? చిత్తూరు జిల్లా మైనర్ బాలిక హత్య కేసు ఏమైంది? 

మీరు రాష్ట్రంలో రావణకాష్ఠాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ... కుల వివక్షతో మా పార్టీ కార్యకర్తలను, వారి కుటుంబాలను గ్రామాల నుంచి వెళ్లగొట్టి హింసిస్తూ, దాన్నుంచి దృష్టి మళ్లించడానికి ఎందుకీ యాతన?" అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 

పార్లమెంటులో ప్రైవేటు మెంబర్ బిల్లు పెడతా!

ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పార్లమెంటులో ప్రైవేటు మెంబర్ బిల్లు పెడతానని విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలో కుల మీడియా సంస్థల పెత్తనం కొనసాగుతోందని మండిపడ్డారు. 

కుట్రపూరితమైన అజెండాతో ఆ మీడియా సంస్థలు ఫేక్ న్యూస్ వ్యాప్తిచేస్తూ, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ, అప్రదిష్ఠపాల్జేసే చర్యలకు పాల్పడుతున్నాయని... వాటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇతర పాత్రికేయ సంఘాలను ఆదేశించేలా బిల్లు పెడతానని వివరించారు. 

అధికారంతో పాటు బాధ్యత కూడా రావాలని, కానీ మీడియాలోని ఒక వర్గంలో ఆ రెండోది లోపించిందని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.  


  • Loading...

More Telugu News