Earth: భూ భ్రమణం మారుతోంది.. కొత్త అధ్యయనంలో సంచలనాలు
- భూగ్రహంపై తీవ్ర ప్రభావం చూపుతున్న వాతావరణ మార్పులు
- ధ్రువపు మంచు కరగడంతో భూమధ్య రేఖ వైపు ద్రవ్యరాశి పంపిణీ
- స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జ్యూరిచ్ యూనివర్సిటీ నూతన పరిశోధనలో వెలుగులోకి ఆసక్తికర విషయాలు
మానవ ప్రేరేపిత వాతావరణ మార్పులు భూగ్రహాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అనేక మార్పులకు కారణమవుతున్నాయి. ఏకంగా భూ భ్రమణం మారుతోందని నూతన అధ్యయనం వెల్లడించింది. వాతావరణ మార్పు భూమి అక్షం మార్పునకు కూడా దారితీస్తోందని స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జ్యూరిచ్ యూనివర్సిటీ నూతన పరిశోధన పేర్కొంది. ధ్రువపు మంచు కరుగుతోందని, ఈ నీరు భూమధ్యరేఖ వైపు ప్రవహిస్తోందని, పర్యవసానంగా భూగ్రహం ద్రవ్యరాశి పంపిణీ జరుగుతోందని, గ్రహం భ్రమణ వేగాన్ని తగ్గిస్తోందని అధ్యయనం పేర్కొంది. పగటి సమయం కాస్త ఎక్కువగా ఉండేందుకు ఈ పరిణామం దారితీస్తుందని వివరించింది. ఈ మేరకు ‘నేచర్ జియోసైన్స్’లో అధ్యయనాన్ని ప్రచురించింది.
కాగా ఈ నూతన అధ్యయనానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ బెనెడిక్ట్ సోజా స్పందిస్తూ.. వ్యక్తులు తమ చేతిని చాచి తిప్పుతున్న సదృశ్యానికి ఉదాహరణగా వివరించారు. భూమి ద్రవ్యరాశి అక్షం నుంచి దూరంగా కదిలినప్పుడు భ్రమణ వేగం పెరుగుతుందని, ద్రవ్యరాశి రివర్స్‌లో పంపిణీ అయినప్పుడు భ్రమణం నెమ్మదిస్తుందని వివరించారు.
సాధారణంగా చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం భూమిపై వుంటుంది. అయితే మనుషులు కర్భన ఉద్గారాలను ఇదే స్థాయిలో నిరంతరాయంగా కొనసాగిస్తే వాతావరణ మార్పులు చంద్రుడి ప్రభావాన్ని కూడా అధిగమించి ప్రభావం చూపగలవని పరిశోధకులు గుర్తించారు. వాతావరణ మార్పులు తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని బెనెడిక్ట్ సోజా హెచ్చరించారు. వాతావరణ మార్పులు భూగ్రహంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని అన్నారు.