Nara Lokesh: దయచేసి మమ్మల్ని సంప్రదించండి... నాస్కామ్ సభ్యులకు ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం
- ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్
- బిల్లుకు కర్ణాటక క్యాబినెట్ ఆమోదం తెలపడంపై నాస్కామ్ అసంతృప్తి
- ఏపీకి వచ్చేయండి... అత్యుత్తమ సదుపాయాలు కల్పిస్తామన్న ఐటీ శాఖ మంత్రి లోకేశ్
ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలలో స్థానికులకు రిజర్వేషన్ కల్పించాలన్న బిల్లుకు కర్ణాటక మంత్రివర్గం ఆమోదం తెలపడంపై నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి రిజర్వేషన్ల వల్ల కంపెనీల్లో నిపుణులైన ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ వల్ల ప్రతిభావంతులైన ఉద్యోగులు లేక పనితీరు కుంటుపడుతుందని, తద్వారా సాఫ్ట్ వేర్ కంపెనీలు తరలిపోయే ప్రమాదం ఉందని నాస్కామ్ స్పష్టం చేసింది. దీనిపై ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
"ప్రియమైన నాస్కామ్ సభ్యులకు... మీ అసంతృప్తిని మేం అర్థం చేసుకోగలం. మీ వ్యాపారాలు విస్తరించుకోవడానికి, లేక, ఇతర ప్రాంతాల నుంచి వైజాగ్ లోని మా ఐటీ సేవలు, ఏఐ, డేటా సెంటర్ క్లస్టర్ కు మీ వ్యాపారాలను తరలించుకోవడానికి మీకు స్వాగతం పలుకుతున్నాం.
ఐటీ రంగంలోనే అత్యుత్తమ స్థాయి సౌకర్యాలను మీకు కల్పిస్తామని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. ఎలాంటి అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం తరఫున ఎలాంటి ఆంక్షలు లేని రీతిలో అత్యంత అనుకూలవంతమైన నిపుణులను మీకు అందిస్తాం. మీ ఐటీ వ్యాపారాలకు స్వాగతం పలికేందుకు ఏపీ సిద్ధంగా ఉంది. దయచేసి మమ్మల్ని సంప్రదించండి" అంటూ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు.