Risky Reels: డ్యాన్స్ చేస్తూ కారు నడిపిన మహిళలు.. వారి సంగతేంటో చూడమని పోలీసులకు ఆదేశాలు.. వీడియో ఇదిగో!
- మహీంద్రా థార్‌ను డ్రైవ్ చేస్తూ డ్యాన్స్ చేసిన మహిళ
- పక్కనే కూర్చున్న మరో మహిళతో కలిసి స్టీరింగ్ వదిలి చిందులు
- యూపీలోని ఘజియాబాద్-ఢిల్లీ మార్గంలో ఘటన
- ఇలాంటి వారి వల్లే ఇతరుల ప్రాణాలు ప్రమాాదంలో పడుతున్నాయన్న నెటిజన్లు
సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవాలన్న తపనతో కొందరు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. రీల్స్ మోజులో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. రోజుకోచోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నా మార్పు మాత్రం కనిపించడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి రిస్కీ రీల్ చేస్తున్న ఇద్దరు మహిళల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహీంద్రా థార్ ఎస్‌యూవీని డ్రైవ్ చేస్తున్న మహిళతోపాటు ఆమె పక్కన కూర్చున్న మహిళ డ్యాన్స్ చేస్తూ ప్రమాదకరంగా కారును నడిపారు. ఓ పాటకు వారిద్దరూ చేతులు ఊపుతూ పాటకు అనుగుణంగా శరీరాన్ని కదపడం కనిపించింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న మహిళ స్టీరింగ్ వదిలి స్టెప్పులేసింది. ఘజియాబాద్-ఢిల్లీ మార్గంలోని ఎన్ఎస్9పై ఈ ఘటన జరిగింది.
ఈ వీడియోను ఎక్స్ యూజర్ ఒకరు షేర్ చేస్తూ.. ఆమె తనంత తానుగా చనిపోవడంతోపాటు మరికొందరి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేయబోతున్నదని రాసుకొచ్చాడు. ఘజియాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే మార్గంలో ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నాడు. వీడియో కాస్తా పోలీసు శాఖ దృష్టిలో పడడంతో, వారి సంగతేంటో చూడాలని ఘజియాబాద్ పోలీసులను ఆదేశించింది.
ఇలాంటి వారివల్లే రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ఓ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేస్తే, ఇలాంటి వారి వల్లే ఇతరుల ప్రాణాలు రిస్క్‌లో పడుతున్నాయని మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు. వీరు మాత్రమే కాదని, చాలామంది డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం, వాట్సాప్ మెసేజ్‌లకు ప్రతిస్పందించడం, సడన్‌గా వేగాన్ని తగ్గించడం, ఒక లైన్లోంచి అకస్మాత్తుగా మరో లైన్లోకి దూసుకురావడం, బిగ్గరగా హారన్ కొట్టడం వంటివి చేస్తున్నారని ఇంకో యూజర్ కామెంట్ చేశాడు.