ICC T20 World Cup 2024: అమెరికాలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు నిర్వహణ ఫలితం.. ఐసీసీకి రూ.167 కోట్లు నష్టం
- అత్యధిక మ్యాచ్‌లు అమెరికాలోనే నిర్వహణ
- ప్రేక్షకులు లేక వెలవెలబోయిన స్టేడియాలు
- భారీ ఆర్థిక నష్టాన్ని మూటగట్టుకున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి
- రేపు కొలంబో వేదికగా జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ అంశంపై చర్చించే అవకాశం
ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2024 మ్యాచ్‌ల్లో కొన్నింటిని అమెరికాలో నిర్వహించడం అంతర్జాతీయ క్రికెట్ మండలిని (ఐసీసీ) భారీగా దెబ్బతీసింది. ఐసీసీకి ఏకంగా రూ.167 కోట్ల నష్టం వాటిల్లిందని పలు కథనాలు పేర్కొంటున్నాయి. శ్రీలంక రాజధాని కొలంబోలో శుక్రవారం మొదలుకానున్న ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ అంశంపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. వార్షిక సర్వసభ్య సమావేశంలో చర్చించాలని నిర్ణయించిన తొమ్మిది పాయింట్ల ఎజెండాలో ఈ అంశం లేకపోయినప్పటికీ ‘పోస్ట్ ఈవెంట్ రిపోర్ట్’గా టీ20 వరల్డ్ కప్ నష్టంపై చర్చించనున్నారని పీటీఐ కథనం పేర్కొంది.
కాగా టీ20 వరల్డ్ కప్ 2024లో ఎక్కువ మ్యాచ్‌లను అమెరికాలోనే నిర్వహించారు. ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ను కూడా అమెరికాలోని న్యూయార్క్ లో నిర్వహించారు. బేస్‌బాల్ అమితంగా ఇష్టపడే అమెరికన్లు క్రికెట్‌ను పెద్దగా ఆదరించకపోవడమే ఐసీసీ నష్టాలకు కారణంగా ఉంది. ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా అమెరికాలో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ప్రేక్షకులు లేక మైదానాలు వెలవెలపోయాయి.
కాగా రేపు (శుక్రవారం) కొలంబోలో జరిగే ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఐసీసీ తదుపరి ఛైర్మన్ ఎవరనే అంశంపై చర్చించనున్నారు. బీసీసీఐ సెక్రటరీ జై షాను ఐసీసీ చైర్మన్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయంటూ కథనాలు వెలువడుతున్నాయి.