Revanth Reddy: రైతు రుణమాఫీకి ప్రాతిపదిక రేషన్ కార్డు కాదు... దొంగమాటలు నమ్మకండి: స్పష్టతనిచ్చిన రేవంత్ రెడ్డి
- రుణమాఫీకి పాస్ బుక్ మాత్రమే ప్రాతిపదిక అన్న ముఖ్యమంత్రి
- సాంకేతిక లోపం వస్తే బ్యాంకు అధికారులు సహకరిస్తారని వెల్లడి
- కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని మరోసారి రుజువైందన్న సీఎం
రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదని... పాస్ బుక్ మాత్రమే ప్రాతిపదిక అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు రూ.1 లక్ష వరకు రుణమాఫీ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక అని అసత్యాలు, అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కానీ రుణమాఫీకి పాస్ బుక్ మాత్రమే కొలబద్ద అన్నారు.
కొంతమంది చెబుతున్న దొంగమాటలు నమ్మవద్దన్నారు. రుణమాఫీ కావాలంటే భూమి ఉండాలి... పాస్ బుక్ ఉండాలి... రుణం తెచ్చుకొని ఉండాలని వ్యాఖ్యానించారు. రుణమాఫీకి సంబంధించి ఏదైనా సాంకేతిక లోపం వస్తే బ్యాంకు అధికారుల వద్దకు వెళ్లాలని సూచించారు. వారు కూడా సహకరిస్తాన్నారు.
కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలాశాసనని మరోసారి రుజువైందన్నారు. రైతు డిక్లరేషన్లో చెప్పినట్లుగా రుణమాఫీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా... ఎన్ని సవాళ్లు ఎదురైనా రుణమాఫీని అమలు చేస్తున్నామన్నారు. నాడు తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారన్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం రుణమాఫీ అమలును నెరవేర్చిందన్నారు.
బీఆర్ఎస్ 2014లో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని, 2018లోనూ అదే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ అమలు చేయలేదని విమర్శించారు. కానీ మనం ఎనిమిది నెలల్లో మాటను నిలబెట్టుకున్నామన్నారు. తద్వారా ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నామన్నారు. తన జీవితంలో ఇది మరుపురాని రోజు అన్నారు. రైతును రాజును చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. రైతులు తలెత్తుకునేలా ఈ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
వరంగల్ సభలో ఇచ్చిన డిక్లరేషన్ మేరకు రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లు చెప్పారు. ఇది తొలి విడత మాఫీ మాత్రమేనని, ఆగస్ట్లోగా రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న అన్నీ మాఫీ చేస్తామన్నారు. తాను ఢిల్లీకి వెళ్లి, ఈ నెలాఖరులో వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. ఏ వరంగల్ గడ్డ మీద రుణమాఫీ మాట ఇచ్చామో... ఆ మాట నిలబెట్టుకున్న సందర్భంగా రాహుల్ గాంధీని పిలిచి సభ ఏర్పాటు చేసి సంబరాలు చేసుకుందామన్నారు.