FasTag: ఫాస్టాగ్ మార్గదర్శకాల విడుదల.. వారికి రెట్టింపు ఛార్జీల విధింపు
- ఉద్దేశపూర్వకంగా విండ్షీల్డ్పై ఫాస్టాగ్ బిగించని వాహనదారుల నుంచి రెట్టింపు ఛార్జీలు వసూలు
- అన్ని యూజర్ ఫీజు కలెక్షన్ ఏజెన్సీలకు మార్గదర్శకాలు జారీ
- ఫాస్టాగ్‌కు సంబంధించి సంపూర్ణ మార్గదర్శకాలు విడుదల చేసిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా
కొంతమంది వాహనదారులు ఫాస్టాగులను వాహనం విండ్షీల్డ్పై బిగించడం లేదు. ఈ తరహా వాహనదారుల కారణంగా టోల్ గేట్ల వద్ద చెల్లింపుల విషయంలో ఇబ్బందులు తలెత్తి, అంతరాయం ఏర్పడుతోంది. ఇలాంటి వాహనదారులను దారిలో పెట్టడమే లక్ష్యంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్తగా సంపూర్ణ మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఉద్దేశపూర్వకంగా ఫాస్టాగ్‌ను బిగించని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ ఛార్జీలు వసూలు చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. విండ్‌స్క్రీన్‌పై ఫాస్టాగ్ బిగించకపోవడంతో టోల్ ప్లాజాల వద్ద అనవసరమైన జాప్యాలు జరుగుతున్నాయని, ఇతర వాహనదారులు అసౌకర్యానికి గురయ్యేందుకు దారితీస్తాయని పేర్కొంది. ఈ మేరకు రెట్టింపు ఛార్జీలు వసూలు చేయాలంటూ అన్ని యూజర్ ఫీజు కలెక్షన్ ఏజెన్సీలు, రాయితీదారులకు వివరణాత్మక ‘ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ’ను (ఎస్వోపీ) జారీ చేసింది. దీంతో ఫాస్టాగ్‌లను సరిచేసుకోని వాహనదారులు రెట్టింపు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
విండ్షీల్డ్పై ఫాస్టాగ్ లేకుండా టోల్ లేన్‌లోకి ప్రవేశిస్తే విధించే ఛార్జీలపై ఫీజులతో కూడా బోర్డులు ప్రదర్శించాలని స్పష్టం చేసింది. ఇక ఫాస్టాగ్‌లు లేని వాహనాల వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను సీసీటీవీ ఫుటేజీని రికార్డు చేయాలని సూచించింది. తద్వారా వాహనాలకు సంబంధించిన రికార్డులను నిర్వహించవచ్చునని పేర్కొంది.
ప్రామాణిక ప్రక్రియ ప్రకారం ఫాస్టాగ్‌లను బిగించుకోకపోతే లావాదేవీల నిర్వహణకు అర్హత ఉండదని స్పష్టం చేసింది. అలాంటి వారు రెట్టింపు టోల్ రుసుమును చెల్లించాల్సి ఉంటుందని, వారిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చవచ్చునని పేర్కొంది.