Shashi Tharoor: శ్రీలంక టూర్‌కు సంజు శాంసన్, అభిషేక్ శర్మను ఎంపిక చేయకపోవడంపై శశిథరూర్ ఫైర్
- ఈ నెల 27 నుంచి శ్రీలంకలో పర్యటించనున్న టీమిండియా
- వన్డే జట్టులో సంజు శాంసన్, టీ20లకు అభిషేక్ శర్మకు దక్కని చోటు
- అద్భుతాలు చేసే వారి ప్రదర్శన సెలక్టర్లకు చిన్నగా అనిపించి ఉండొచ్చన్న శశిథరూర్
శ్రీలంకతో త్వరలో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మలను పక్కన పెట్టడంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 27 నుంచి భారత జట్టు శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడుతుంది. టీమిండియా కొత్త కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టీమిండియా వన్డే, టీ20 జట్లను ఎంపిక చేసింది.
వన్డే సిరీస్ నుంచి సంజు శాంసన్, టీ20 సిరీస్ నుంచి అభిషేక్ శర్మను సెలక్షన్ కమిటీ పక్కనపెట్టింది. జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో సెంచరీ సాధించిన అభిషేక్ శర్మను పక్కన పెట్టడంపై శశిథరూర్ మండిపడ్డారు. తన గత వన్డేలో సెంచరీ సాధించిన ఓ బ్యాటర్‌ను, జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో శతకం నమోదు చేసిన అభిషేక్ శర్మను ఎంపిక చేయలేదు. అద్భుతాలు చేసేవారి ప్రదర్శన సెలక్టర్లకు చిన్నగా అనిపించి ఉండొచ్చని విమర్శించారు. ఏది ఏమైనా జట్టుకు శుభాకాంక్షలు అని తెలిపారు.