Kanwar Yatra: ఇది యూపీనా?.. నాజీల జర్మనీయా?.. పోలీసుల ఆదేశాలపై విపక్షాల ఫైర్
- ఈ నెల 22 నుంచి కన్వర్ యాత్ర
- యూపీలో 240 కిలోమీటర్ల మేర సాగనున్న యాత్ర
- యాత్ర సాగే మార్గాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు తమ యజమానుల పేర్లు ప్రదర్శించాలని ఆదేశాలు
- తీవ్రంగా స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ
ఉత్తర ప్రదేశ్ పోలీసుల తాజా ఆదేశాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కన్వర్ యాత్ర సాగే మార్గంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఇతర ఆహార పదార్థాలు విక్రయించే వారు తమ యజమానుల పేర్లను స్వచ్ఛందంగా ప్రదర్శించాలని ముజఫర్‌నగర్ పోలీసులు ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాలపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దక్షిణాఫ్రికాలోని వర్ణవివక్ష, హిట్లర్ జర్మనీ విధానాలను రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
శివ భక్తులు చేపట్టే కన్వర్ యాత్ర ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్‌లోని దాదాపు 240 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది. ఈ నేపథ్యంలో యాత్ర సాగే మార్గంలో హోటళ్లు, దాబాలు, రోడ్డు పక్కన ఉండే ఆహార పదార్థాల విక్రేతలు తమ యాజమానుల పేర్లను కానీ, లేదంటే ఆయా స్టాళ్లలో ఉండే వారి పేర్లను కానీ ప్రదర్శించాలని ముజఫర్‌నగర్ సీనియర్ ఎస్పీ అభిషేక్ సింగ్ ఆదేశాలు జారీచేశారు.
పొరపాటున కూడా కొనొద్దనేగా: ఒవైసీ
ఈ ఆదేశాలపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ముస్లింల షాపుల నుంచి కన్వర్ యాత్రికులు పొరపాటున కూడా ఏమీ కొనకుండా ఉండేందుకే పోలీసులు ఈ ఆదేశాలు జారీచేశారని ఆరోపించారు. సౌతాఫ్రికాలో వర్ణవివక్ష, హిట్లర్ జర్మనీలోని ‘జుడెన్ బాయ్‌కాట్’తో దీనిని పోల్చారు. బాలీవుడ్ పాటల రచయిత జావెద్ అక్తర్ కూడా ఈ ఆదేశాలను తప్పుబట్టారు. నాజీ జర్మనీలోనూ ఇలా ప్రత్యేకంగా కొందరి దుకాణాలు, ఇళ్లను మార్క్ చేసేవారని గుర్తు చేశారు.
అబ్బే.. అందుక్కాదు: పోలీసులు
వివాదాస్పద ఆదేశాలపై విమర్శలు రావడంతో పోలీసులు వివరణ ఇచ్చారు. ఇందులో మతపరమైన ఎలాంటి వివక్ష లేదని, కన్వర్ యాత్రికుల సౌలభ్యం కోసమే ఈ ఆదేశాలని పేర్కొన్నారు. రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లలో అన్ని రకాల ఆహార పదార్థాలు విక్రయిస్తారని, యాత్రికులు గందరగోళానికి గురై తద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకే ఈ ఆదేశాలు జారీచేసినట్టు పేర్కొన్నారు.