Peddvagu Project: భద్రాద్రి జిల్లాలో పెద్దవాగుకు గండి.. హెలికాప్టర్ సాయంతో కూలీల ప్రాణాలు కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. వీడియో ఇదిగో!
- వరద నీటిలో కొట్టుకుపోయిన వందల పశువులు.. వేల ఎకరాల్లో పంట నష్టం
- రాత్రంతా కొండలు, గుట్టలపై తలదాచుకున్న ప్రజలు
- భద్రాచలంలో ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న గోదావరి నది
- చిక్కుకుపోయిన కూలీలను రక్షించిన ఎన్డీఆర్ఎఫ్
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గతరాత్రి రెండుచోట్ల గండిపడింది. దీంతో ప్రాజెక్టు మొత్తం ఖాళీ అయింది. ఈ క్రమంలో వరద ప్రవాహంలో వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల ప్రజలు రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొండలు, గుట్టలు, ఎత్తైన భవనాలపై గడిపారు.
మరోవైపు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నిన్న ఇక్కడ 20 అడుగులు ఉన్న నీటమట్టం ఈ ఉదయం 9 గంటలకు 24.5 అడుగులకు చేరుకుంది. ఎగువన ఉన్న పేరూరులో 40.86 అడుగుల నీటిమట్టం నమోదైంది.
నీటిమట్టం 43 అడుగులకు చేరుకోగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం గజ ఈతగాళ్లు, పడవలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.
హెలికాప్టర్ సాయంతో కూలీలను రక్షించిన ఎన్డీఆర్ఎఫ్
బుధవారం రాత్రి నుంచి భద్రాద్రి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పెద్దవాగులో భారీగా నీరు చేరింది. దీంతో బచ్చువారిగూడెం-నారాయణపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగుకు గండిపడడంతో గుమ్మడవల్లి-కొత్తూరు గ్రామాలు నీట మునిగాయి. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు, కూలీలు దాదాపు 25 మంది చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్ సాయంతో వారిని రక్షించి గమ్యస్థానాలకు చేర్చారు.