Naveen Patnaik: 'షాడో కేబినెట్' ఏర్పాటు చేసిన నవీన్ పట్నాయక్!
- బీజేపీ ప్రభుత్వం పనితీరును పర్యవేక్షించేందుకు షాడో కేబినెట్
- పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలకు ఆయా శాఖల అప్పగింత
- షాడో మంత్రివర్గానికి సంబంధించిన ఉత్తర్వు జారీ చేసిన బీజేడీ పార్టీ
ఒడిశా రాజకీయాల్లో ఆసక్తికర సంఘటన! మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ 'షాడో కేబినెట్'ను ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రభుత్వం పనితీరును పరిశీలించేందుకు ఆయన ఈ కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలకు ఒక్కో శాఖను అప్పగించారు. ప్రభుత్వం పనితీరుపై షాడో కేబినెట్‌ను ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. ఒడిశాలో బీజేడీ సుదీర్ఘకాలం పాలన చేసింది. మోహన్ మాంఝీ నేతృత్వంలో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడింది.
ఆర్థికశాఖ మాజీ మంత్రి ప్రసన్న ఆచార్యకు ఆర్థిక శాఖ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పరిపాలన, ప్రజా ఫిర్యాదులను ప్రతాప్ దేబ్ పర్యవేక్షిస్తారు. మాజీ మంత్రి నిరంజన్ పూజారి గృహ, ఆహారం, వినియోగదారుల సంక్షేమ శాఖలను పర్యవేక్షిస్తారు.
షాడో మంత్రివర్గానికి సంబంధించిన ఒక ఉత్తర్వును బీజేడీ జారీ చేసింది. షాడో కేబినెట్ బాధ్యతలు కలిగిన వారు ప్రభుత్వంలోని ఆయా శాఖల నిర్ణయాలను, విధానాలను నిశితంగా పరిశీలిస్తారు. ఇదేమీ ప్రభుత్వ అధికారిక సంస్థ కాదు. ఎలాంటి అధికారాలు ఉండవు. కేవలం మంత్రివర్గాన్ని ప్రతిపక్షంగా పర్యవేక్షించేందుకు ఈ షాడో కేబినెట్‌ను ఏర్పాటు చేశారు.