Harish Rao: వారికి ఇంటి అద్దెలు చెల్లించడం కూడా భారంగా మారింది: హరీశ్ రావు
- ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శ
- చిరు ఉద్యోగుల వెతలు ప్రభుత్వానికి పట్టడం లేదా? అని మండిపాటు
- ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఏడు నెలలుగా వేతనాలు లేవన్న మాజీ మంత్రి
ఒకటో తేదీనే వేతనాలను చెల్లిస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చిరు ఉద్యోగుల వెతలు కనిపించడం లేదా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పని చేస్తోన్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీంతో ఇంటి అద్దెలు చెల్లించడం కూడా భారంగా మారిందని, పీఎఫ్ డబ్బులు సైతం జమచేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలిపారు.
ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. చిరు ఉద్యోగులను పట్టించుకోవాలన్నారు. తక్షణమే ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. 7 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.