Hyderabad: గమ్యస్థానాలకు పంపించండి: శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం
- విండోస్ లో సాంకేతిక లోపం... శంషాబాద్ నుంచి వెళ్లే పలు విమానాల రద్దు
- 8 గంటలుగా విమానాశ్రయంలో ప్రయాణికుల పడిగాపులు
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికుల డిమాండ్
మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక లోపం ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇండిగో విమానాలూ రద్దయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు 8 గంటలుగా విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు.
బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, గోవా, వైజాగ్, లక్నో, కోల్కతా, ముంబయి తదితర ప్రాంతాలకు విమానాలు రద్దయ్యాయి. గంటల కొద్దీ విమానాశ్రయంలోనే ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చంటిపిల్లలు, వృద్ధులు, పిల్లల తల్లులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమను వెంటనే గమ్యస్థానాలకు పంపించాలని వారు ఎయిర్ లైన్స్ సిబ్బందితో మొరపెట్టుకున్నారు. సరైన సమాధానం రాకపోవడంతో ప్రయాణికులు ఎయిర్ లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
విమానాల రద్దు
శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాలు రద్దయ్యాయి. విమానాశ్రయ అధికారులు దాదాపు 35 విమానాలు రద్దు చేశారు. ఎయిర్ పోర్టులో డిస్ప్లే బోర్డులు కూడా పని చేయలేదు. దీంతో అధికారులు మాన్యువల్ బోర్డులు ఏర్పాటు చేశారు.